విష్ణుపురాణంలో ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన పూజ గురించి వివరంగా చెప్పబడింది. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఎలాంటి పూజలు నిర్వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంపదకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తామర పువ్వులు బిల్వపత్రాలు శంకు పుష్పాలతో పరమేశ్వరుడిని పూజించడం వల్ల సంపదలు లభిస్తాయట. అలాగే హిమాలయాలలో మాత్రమే లభించే శతరేకులు ఉన్న తామర పువ్వులతో పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంవత్సరం తిరిగేసరికి మహదైశ్వర్య సంపన్నులు అవుతారని పండితులు చెబుతున్నారు.
పాపాలు తొలగిపోవాలి అనుకున్న వారు తామర పువ్వుల రేకులను విడదీసి శివ శతా అష్టోత్తరం 108 నామాలతో శ్రద్ధగా నమః అని పలుకుతూ ఒక్కొక్క నామానికి తామర రేకు వేస్తూ పూజ చేస్తే మహా పాపాలు తొలగిపోయి సంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
కోరిన కోరికలు నెరవేరాలి అనుకున్న వారు 11 రోజులపాటు క్రమం తప్పకుండా శివుడిని ఏ రోజుకు ఆ రోజు 20 తామర పువ్వులు 1000 మారేడు దళాలతో అర్పించడం వల్ల ఈశ్వరుడు సంపూర్ణంగా ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు..
అలాగే మంచి పదవి కావాలంటే 10 కోట్ల పుష్పాలతో పార్థివ లింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుందట. పార్థివ లింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే, అనుకున్న పని తొందరగా ఫలిస్తుందట. మానవుడు కోరికలు ఉన్నంత వరకు భౌతికపూజ తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు.
జ్ఞానం కావాలంటే ఎల్లప్పుడు శివనామం అనంతంగా మానసికంగా జపిస్తూ ఉండాలట. పరమేశ్వరుడి ముందు కదలకుండా 24 నిమిషాలు మౌనంగా శివుడిపై మనస్సుని నిలిపి ధ్యానిస్తే, ఈ జన్మలోనే మోక్షం కలుగుతుందని చెబుతున్నారు.
శివైక్యం కోసం దాదాపుగా 5 లక్షల సార్లు ఒక మనిషి తన జీవితంలో మహా మృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడులో ఐక్యమవుతారని, 11 రోజుల బిల్వపత్రాలు శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్థిస్తే శివ దర్శనం తప్పక లభ్యం అవుతుంది అని పండితులు చెబుతున్నారు.
సంతానం కలగని వారు పుత్ర సంతానం ప్రాప్తి కోసం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, భర్త ఉమ్మెత్త పువ్వులతో 15 రోజులు ఈశ్వరుడ్ని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కల్గుతుందట. ఎర్ర కాండం ఉన్న ఉమ్మెత పువ్వులతో శివుడ్ని అర్చిస్తే, బుద్ధివంతుడు, యోగ్యుడైనవాడు, మాతృ, పితృ భక్తి కల్గిన పుత్ర సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.