Khara Masam: ఖర మాసం మొదలైంది.. ఏం చేయాలి.. ఏం చేయొద్దు.. మళ్లీ శుభ ముహూర్తాలు ఎప్పుడు?

ఖర మాసం మొదలైంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 15న ఉదయం 5:17 గంటలకు ఖర మాసం స్టార్ట్ అయింది. ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు.

ఖర మాసం (Khara Masam) మొదలైంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 15న ఉదయం 5:17 గంటలకు ఖర మాసం స్టార్ట్ అయింది. ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఖర మాసం ఏప్రిల్ 14 వరకు ఉంటుంది.ఈ సమయంలో అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర మాసంలో సూర్యుడు మీనం లేదా ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు.. శుభ రాశుల మీద, యోగం మీద, శుభ కార్యాలపై అశుభ ప్రభావం చూపుతుంది. పెళ్లి, ముహూర్తం లాంటి ముఖ్యమైన పనులు కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల కొత్తగా పెళ్లయిన జంట జీవితంలో కష్టాలు తప్పవు.

ఇదొక్కటే కాదు.. కొత్త వాహనం, ఇల్లు లేదా మరేదైనా ఆస్తిని ఖర మాసంలో (Khara Masam) కొనొద్దు.మీరు కొత్త ఉద్యోగం గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయంలో ట్రై చేయకండి.  లేకుంటే మున్ముందు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఖర మాసంలో శుభ కార్యాలు జరగవు. గృహ ప్రవేశం, ఉపనయనం, ముండనం, నిశ్చితార్థం కూడా చేయకూడదు.  వాటి కోసం ఖర మాసం ముగిసిన తర్వాత సమయాన్ని ఎంచుకోండి. ఈ మాసంలో భగవంతుని పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.

ఈ సమయంలో సూర్య భగవానుని పూజిస్తారు. దీనివల్ల అదృష్టాన్ని మరియు సంపదలను పొందొచ్చు.  ఈ మాసంలో ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. కుంకుడు, పసుపు పువ్వులు, అక్షతలను సమర్పించండి. ఖర మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి.  ఖర మాసంలో తులసిని పూజించడం వల్ల ఐశ్వర్యం, ధన ధాన్యాలు , ఆరోగ్యం లభిస్తాయి.

మే 2 నుంచి శుభ కార్యాలు ప్రారంభం.. ఎందుకంటే..

జ్యోతిశ్య నిపుణుల ప్రకారం.. సూర్యుడు.. ధనుస్సు మరియు మీన రాశులలోకి ప్రవేశించినప్పుడు సంవత్సరానికి రెండుసార్లు ఖర మాసాలు వస్తాయి. సూర్యుడు ఈ రాశిలో ఒక నెలపాటు ఉంటాడు.  మీనరాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో.. గురు గ్రహం యొక్క ప్రకాశం కూడా బలహీనంగా మారుతుంది. ఈ టైంలో బృహస్పతి స్వభావంలో ఉగ్రత ఉంటుంది.

ఏదైనా శుభ కార్యం చేయాలంటే త్రిబలం అవసరం. త్రిబలం అంటే.. సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క శక్తి. ఎప్పుడైతే మూడు గ్రహాలు ఉత్తమ స్థానంలో ఉంటాయో.. అప్పుడే శుభ కార్యాలు జరుగుతాయి. వీటిలో ఏదైనా ఒకటి బలహీనంగా ఉన్నా శుభకార్యం జరగదు. అయితే ఈసారి శుభ ముహూర్తం కోసం మే 2 వరకు వేచి ఉండాలి. ఏప్రిల్ 29 వరకు బృహస్పతి అస్తమిస్తుంది. బృహస్పతి బాల్య దోషం మూడు రోజులు ఉంటుంది. అందుకే మే 2 నుంచి అన్ని శుభ కార్యాలు ప్రారంభం కానున్నాయి.

Also Read:  Lord Ganesha: కలలో వినాయకుడి కనిపిస్తున్నాడా.. దేనికి సంకేతమో తెలుసా?