Site icon HashtagU Telugu

Temple Tour : జీవితంలో ఒక్కసారైనా..జ్యోతిర్లింగాలను దర్శించాలి…ఎందుకో తెలుసా..:?

12 Jyotirlingas Temples In India

12 Jyotirlingas Temples In India

శివుడు ఎంత శాంతంగా ఉంటాడో…అంతే కోపంగా ఉంటాడు. అంతకుమించి భక్తుల కోరికలు తీర్చడంలోనూ ముందుంటాడు. భక్తిశ్రద్ధలతో ఆయన్ను కొలిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శివుడికి ఇష్టమైన వాటితో పూజిస్తే…సకల భోగాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. శివుడిని మూర్తి రూపంలో, లింగ రూపంలో పూజిస్తారు. కానీ లింగ రూపామే ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం.

అయితే వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలిచే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించినా…జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని నిత్యం పఠించినా ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. సౌరాష్ట్ర సోమనాథుడిని దర్శించినా భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీశైలమల్లికార్జునుడ్ని సేవించినా…సర్వదరిద్రాలు సమసిపోతాయిని నమ్మకం. ఉజ్జయిని మహాకాలుడ్ని కొలిచితే సర్వభయపాపాలూ హరించుకుపోతాయి. ఓంకారేశ్వరము, అమర లింగేశ్వరుడు, ఇహపరాలూ సౌఖ్యానిస్తాడు. పరళి వైద్యనాథలింగాన్ని సేవించినా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారని చాలా మంది భక్తుల నమ్మకం.

రామేశ్వర లింగాన్ని దర్శించి..కాశీలో గంగా జలాన్ని అభిషేకించినా..మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమపదాన్ని చేరుతారని పురాణాలు చెబుతున్నాయి. ద్వారక నాగేశ్వరుడిని దర్శించినా..మహాపాతకాలూ, ఉపపాతకాలూ నశిస్తాయి. కాశీ, విశ్వేశ్వరలింగాన్ని సేవించిన సమస్త కర్మ బంధాల నుంచి విముక్తి, లభిస్తుంది. నాసిక్ త్ర్యంబకేశ్వర స్వామిని కొలిచితే..కోరికలు తీరుతాయి. అపవాదులు సమసిపోతాయి. హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించినవారు ముక్తిని పొందుతారట. ఇలా ఒక్కో లింగాన్ని దర్శిస్తే ఒక్కో ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.