హిందూమతంలో సూర్యుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించి పూజలు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తూ ఉంటారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారని చెబుతూ ఉంటారు. కాగా ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే కేవలం నీటిని అందించడం ద్వారా ఆ సూర్య భగవానున్ని ప్రసన్నం చేసుకోవచ్చట. అయితే సూర్యభగవానుడికి నీటిని సమర్పించే ముందు కొన్ని రకాల నియమాలు తెలుసుకోవడం తప్పనిసరి అంటున్నారు పండితులు.
అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నియమాలు పాటించడమే కాకుండా సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే సూర్య భగవానుడికి నీరు సమర్పించాలి. సూర్య భగవానునికి రోజూ నీళ్ళు సమర్పిస్తే డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు పండితులు. వీలైతే ఉదయించే సూర్యునికి నీరు అందించాలని చెబుతున్నారు. ఉదయపు సూర్య కిరణాలు శరీరంపై పడడం వల్ల శరీర నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి, ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించాలని చెబుతున్నారు.
సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మూడు సార్లు ప్రదక్షిణలు చేసి భూమి పాదాలను తాకాలి. ఈ సమయంలో మంత్రాన్ని జపించాలట. ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయానికి వస్తే..” ఓం సూర్యాయ నమః” సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు, మీ రెండు చేతులను మీ తలపైకి లేపి, నీటిని సమర్పించాలి. సూర్యభగవానుడికి నీరు సమర్పించడం వల్ల కలిగే మరో ప్రత్యేకత ఏమిటంటే, నేరుగా నవగ్రహాల ఆశీస్సులు అందుతాయట. అయితే ఇలా నీటిని సమర్పించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు. అర్ఘ్యం నైవేద్యంగా పెట్టేటప్పుడు నీళ్లలో ఎర్రని పువ్వులు కలుపుకుంటే చాలా మంచిదట.
అయితే సూర్య భగవానుడికి ఎప్పుడూ ఉదయం పూట మాత్రమే నీటిని సమర్పించాలట. మీరు సూర్యుడిని చూడలేకపోతే, అతని పేరు తలచుకుంటూ, మీరు నిలబడి ఉన్న చోట నీరు సమర్పించాలట. దీని వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో “ఓం ఆదిత్య నమః” అనే మంత్రాన్ని జపించాలట. మీరు “ఓం ఘృణి సూర్యాయ నమః” అని కూడా జపించవచ్చట. సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచాలి. సూర్యుడు తూర్పు వైపు ప్రకాశించకపోతే, ఇతర దిశకు ముఖం చేసి, ఆపై నీటిని సమర్పించాలి.