Site icon HashtagU Telugu

Tirumala Laddu Issue : రాజకీయాల్లోకి దేవుడ్ని తీసుకరాకండి – సుప్రీం కోర్ట్

Sc Laddu Issue

Sc Laddu Issue

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం (Tirumala Laddu Issue) ఫై సుప్రీం కోర్ట్ స్పందించింది. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందని..జంతువుల కొవ్వు తో లడ్డు తయారీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు మీడియా ముందు తెలుపడం తో ఒక్కసారిగా యావత్ భక్తులు ఆందోళనకు గురయ్యారు. దేవుడ్ని కూడా కల్తీ చేసారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సామాన్య ప్రజలు , హిందూ సంఘాలు , పీఠాధిపతులు , రాజకీయ పార్టీల నేతలు ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తూ..దీనికి పాల్పడిన వారికీ కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం కూడా సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.

లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు సుప్రీం కోర్ట్ లో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.

లడ్డూ వ్యవహారంపై సిట్‌ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలని ఎస్‌జీని కోరిన సుప్రీంకోర్టు, కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని పేర్కొంది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని, కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా.. సుబ్రహ్మణ్యస్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం పలు కీలక ప్రశ్నలను సంధించింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం (AP CM Chandrababu Naidu) చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ కోసం సిట్‌ని ఏర్పాటు చేసిన తరువాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది.

”ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు (Quality Tests) పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు..? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా..? నెయ్యి కల్తీ జరిగినట్లైనా ఆధారాలు చూపించండి. అసలు కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది? నెయ్యిని ల్యాబ్‌కి ఎప్పుడు టెస్ట్‌లకు పంపారు? అన్నింటికంటే ముఖ్యంగా తయారైన లడ్డూలను టెస్టింగ్‌ (Testing)కి పంపారా..? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా..?” అని సూటిగా ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో రాజకీయ జోక్యం (Political Interfearance)పై కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. అనంతరం సిట్ దర్యాప్తుపై కూడా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్ సరిగ్గా విచారణ జరపగలదో లేదోఅనే అనుమానాలున్నాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే బావుంటుందనే అభిప్రాయాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. చివరిగా తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.

Read Also : Amit Shah : వికసిత్‌ భారత్‌ను ఖర్గే చూడాలి..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి: అమిత్‌ షా