Sundarakanda: సుందరకాండ కీలక సన్నివేశం

రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు

  • Written By:
  • Updated On - March 25, 2023 / 05:07 PM IST

సుందరకాండ (Sundarakanda):

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం!
దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్!!
సకలగుణనిదానం వానరాణామధీశం!
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి!!

రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితొ కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగె నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి.

అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.

రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైడుర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దెగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో(సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి, అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు, ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద, పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి, ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.

Also Read:  Sundarakanda: శని ప్రభావంతో కష్టాలు వస్తున్నాయా, ఆరోగ్యం క్షీణిస్తోందా.. సుందరకాండ చదవండి

తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒకామె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది, ఒకామె వేణువు ఊదుతూ నిద్రపోయింది, ఒకామె వీణ వాయిస్తూ నిద్రపోయింది, ఒకామె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణము కాని, వస్త్రము కాని సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు.

రావణుడికి కొంత దూరంలో, బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ‘ ఈవిడే సీతమ్మ ‘ అని హనుమంతుడు అనుకొని, తన భుజాలని కొట్టుకుని, తోకని ముద్దు పెట్టుకుని, విచిత్రమైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు ” మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా. అరరే నా బుద్ధి ఎంత వైక్లవ్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు ” అనుకొని ముందుకి సాగిపోయాడు.

అక్కడినుండి ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు, స్త్రీ-పురుషులు ఒకరిమీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్ధాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళి పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు ” ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను ” అని బాధ పడ్డాడు.

కాని వెంటనే ” ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను ” అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు.

Also Read:  April 6 to May 2: వృషభ రాశిలో శుక్రుడి సంచారం.. 6 రాశుల వారిపై కనక వర్షం

అప్పుడాయన అనుకున్నాడు ” ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండ నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రి. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు, నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను ” అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, ” నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను ‘ సీతమ్మ దర్శనం చేశావా? ‘ అని అడుగుతారు. ‘ నాకు సీతమ్మ జాడ తెలియలేదు ‘ అని చెప్తాను.

సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరు మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, తరవాత అయోధ్యలొ అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతె ఎంత.

బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు, కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతె రాక్షసులు సీతమ్మని తినేసుంటారు, కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దెగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను ” అనుకున్నాడు.

కాని ఆయన వెంటనే ” ఛి! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. మళ్ళి ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను ” అనుకొని,

నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై|

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||

(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు).

” లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక ” అని నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీదనుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన క్రుతికమైన ఒక కొండ, ఆ కొండ మీదనుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది.

అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం, దాని మీదకి శింశుపా వృక్షం ఉంది. అప్పుడాయన ఆ శింశుపా వృక్షం మీదకి దూకి, ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే, చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రి పట్టుపుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నులనిండా నీరు ఉన్న, మళ్ళి మళ్ళి వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా, నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు.

అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని{రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు).

సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు ” మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటె, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలలనుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు, కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దెగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దెగ్గర ఉంది, అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు.

మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి కన్నులతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే, యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః| ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు.

ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు.

నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మ. నీకు నీ అమ్మ(భూదేవి) పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టుకింద కూర్చున్నావ అమ్మ. శీలం, వయస్సు, నడువడి, వంశాలు, శరీరాలు అనే ఈ అయిదు లక్షణాలలో(వివాహం చేసేముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి, మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. కాని రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి ” అని అనుకున్నాడు.

Also Read:  Sri Rama: పర స్త్రీ నీడ సోకనివ్వని సౌశీల్యం.!