TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవని పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అయితే కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాాఢ విశ్వాసం. బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువుదీరారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.
Also Read: ISRO: గగన్‌యాన్ మిషన్‌కు తొలి పరీక్ష చేపట్టేందుకు ఇస్రో సిద్ధం