Site icon HashtagU Telugu

Srisailam: మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్న శ్రీశైలం, భక్తుల కోసం భారీ ఏర్పాట్లు

Chariotsavam Of Bhramaramba Mallikarjuna Swamy In Srisailam.

Chariotsavam Of Bhramaramba Mallikarjuna Swamy In Srisailam.

Srisailam: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి 1 నుండి 11 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేలికగా మల్లన్న దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు బాధ్యతాయుతంగా అధికారులకు అప్పగించిన పనులను నిర్వహించారు.

ప్రధానంగా క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయం, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రద్ధీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలతో పాటు వైద్యనిపుణులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. అలాగే దోమలను అరికట్టేందుకు ఫాగింగ్ మెటిరీయల్ సిద్ధంగా ఉండాలని మలేరియా అధికారిని ఆదేశించారు. శ్రీశైలంలోని పిహెచ్‌సి, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలని డి.ఎం. అండ్ హెచ్.ఓను ఆదేశించారు. ముఖ్య ప్రదేశాలలో రెండు షిఫ్టులలో వైద్యులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్రమార్గములో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు.

బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 31 ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్నామని, ఇందుకు ప్రతిపాదించిన గజ ఈతనిపుణులు, అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధకారులను, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు. రవాణా సౌకర్యాల నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుండి 500 బస్సులు, తెలంగాణా నుండి 450 బస్సులు, కర్ణాటక రాష్ట్రం నుంచి 170 బస్సులు కండిషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత రీజినల్ మేనేజర్లు కలెక్టర్‌కు వివరించారు.