శ్రీరామనవమి (Sri Ramanavami) అనేది హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన పండుగ. ఇది చైత్రమాస శుక్ల పక్షం తొమ్మిదవ రోజు (నవమి) జరుపబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం సాధారణంగా మార్చి చివరి వారంలో నుంచి ఏప్రిల్ నెలలోకి వస్తుంది. అందుకే శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి పండుగ ఏటా ఏప్రిల్ నెలలోనే జరుపబడుతుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాస శుక్ల నవమి నాడు పుట్టాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఈ మాసం విశేషత ఏమిటంటే.. ఇది హిందూ సంవత్సర ప్రారంభంలో వచ్చే మొదటి నెలగా పరిగణించబడుతుంది. చైత్రమాసం ప్రారంభం నూతన ఆరంభానికి సూచికగా భావించబడుతుంది. ప్రకృతి కూడా ఈ సమయంలో ఉత్సాహంగా కళకళలాడుతుంది. వసంత ఋతువులో జరిగే ఈ పండుగ మానవ జీవితంలో కొత్త శాంతి, ధర్మం, సత్సంకల్పం కోసం శ్రీరాముని అనుగ్రహాన్ని కోరే సందర్భం. శ్రీరాముడి ఆదర్శాలను గుర్తుచేసుకుంటూ ధర్మ మార్గంలో నడవాలన్న సందేశాన్ని ఇస్తుంది.
అంతేకాకుండా ఈ కాలంలో సూర్యుని ప్రభ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల పానకం, వడపప్పు వంటి శీతలమైన ప్రసాదాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా కూడా శ్రీరామనవమి (Sri Ramanavami) పండుగ ఏప్రిల్ నెలలో జరగడం ఒక సహజమైన పరంపరగా కొనసాగుతోంది. శ్రీరాముని జన్మదినాన్ని ఈ శుభకాలంలో జరుపుకోవడం ద్వారా భక్తులు అనుగ్రహాన్ని పొందుతారని విశ్వసిస్తారు.