Site icon HashtagU Telugu

Sri Rama Navami: శ్రీరామనవమి పండుగ రోజు ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు మీకు తెలుసా?

Sri Rama Navami

Sri Rama Navami

హిందువులు జరుపుకునే పండుగలు శ్రీరామనవమి పండుగ కూడా ఒకటి. ఉగాది పండుగ తర్వాత ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ శ్రీరామనవమి పండుగ రోజున దేశవ్యాప్తంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తూ ఉంటారు.. ఢిల్లీ నుంచి గల్లి వరకు జానకి రాముల కళ్యాణం కోసం ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి రోజున తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు. మరి ఈ రోజున ఎలాంటి పనులు చేయకూడదో, ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి జరుపుకుంటారు. దీంతో ఈ ఏడాది రేపు అనగా ఏప్రిల్ 6న రామ నవమిని జరుపుకోనున్నారు. కాగా శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే.. ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలట. శ్రీరాముని పట్ల భక్తితో చేతులు జోడించి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలట. మనస్సుని నిర్మలంగా, స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంచుకోవాలని, రోజంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలని చెబుతున్నారు. అలాగే ఈ రోజున సీతారాములతో పాటు హనుమంతుడిని కూడా పూజించాలని చెబుతున్నారు. హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, సుందరా కాండను పఠించాలట. హనుమంతుడికి శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలట. సింధూరం సమర్పించాలట. అలాగే ఈ రోజున పేదలకు ఆహారం, బట్టలు దానం చేయాలనీ చెబుతున్నారు. ఈ రోజంతా కూడా శ్రీరామ అనే నామాన్ని జపిస్తూ రామధ్యానంలో ఉండాలని చెబుతున్నారు. ఈ రోజున, శ్రీరాముడికి పంచామృతంతో స్నానం చేయించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలట. శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముని మంత్రాలను కూడా జపించాలట.

ఇకపోతే శ్రీ రామ నవమి రోజున ఏమి చేయకూడదు అన్న విషయానికొస్తే.. శ్రీ రామ నవమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి తామసిక పదార్థాలు తినకూడదట. ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తినాలని చెబుతున్నారు. ఈ రోజున ఎవరూ ఎవరినీ అవమానించకూడదట. అలాగే అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదట. శ్రీ రామనవమి రోజున అబద్ధం చెప్పవద్దు. కేవలం సత్యాన్ని అనుసరించాలట. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలట. ఈ రోజున ఇంటికి వచ్చే ఏ వ్యక్తినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదట.