Dharmasthala : దక్షిణ భారతదేశంలో విశేషంగా గౌరవించబడే క్షేత్రమైన కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం దాదాపు 800 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం అసాధారణంగా విభిన్నమైన సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది జైనుల ఆధ్వర్యంలో నడుస్తుంది, కానీ మధ్వ వైష్ణవ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు.
ఇతిహాసం పుటల్లో ధర్మస్థల
ధర్మస్థల ప్రదేశం, బెల్తಂಗడి తాలూకాలోని మల్లార్మడి గ్రామంలో ఉంది. ప్రాచీనకాలంలో దీనిని “కుడుమ” అని పిలిచేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ జైనధర్మానికి చెందిన బిర్మన్న పెర్గాడే కుటుంబం నెల్లియడి బీడు అనే ఇంట్లో నివసించేది. ఒక రోజు కొంతమంది ధార్మిక సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని ఆచరించేందుకు ఒక స్థలం ఇవ్వాలని కోరగా, ఆ జంట ఆతిథ్యంగా ఆహ్వానించి వారికి సదా వినయంతో సహాయం చేశారు. ఆ రాత్రి భగవంతుడు వారి కలలో దర్శనమిచ్చి, తమ నివాసాన్ని ధర్మ ఆచరణలకు అంకితం చేయమని ఆదేశించాడట. ఆ దంపతులు నిస్వార్థంగా తమ ఇంటిని ధర్మిక కార్యకలాపాలకు సమర్పించి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. అప్పుడు నుండి ఇది ధర్మస్థలంగా పరిణమించిపోయింది.
చారిత్రక ఆలయ నిర్మాణం
భగవంతుడి సూచన మేరకు ఆ జైన దంపతులకు మరికొన్ని ఆధ్యాత్మిక బాధ్యతలు అప్పగించబడ్డాయి. శ్రీ కాళ రాహువు, శ్రీ కాలర్కాయి, శ్రీ కుమార స్వామి, శ్రీ కన్యాకుమారి దేవతలకు ప్రత్యేకంగా నాలుగు మందిరాలు నిర్మించాలంటూ ఆదేశించబడ్డారు. పూజలు నిర్వహించేందుకు బ్రాహ్మణులను ఆహ్వానించారు. బ్రాహ్మణులు తాము శివలింగంతో కూడిన ఆలయంలో మాత్రమే పూజలు చేస్తామని చెప్పడంతో, మంగళూరులోని కద్రి మంజునాథ స్వామి ఆలయం నుంచి శివలింగాన్ని తీసుకురావాలని అన్నప్ప స్వామిని నియమించారు. ఆ శివలింగాన్ని ధర్మస్థల మధ్యలో ప్రతిష్టించి ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. అన్నప్ప స్వామికి స్మారకంగా ఆలయం సమీపంలో ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు, ఇది ప్రధాన ఆలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉంది. ఈ ప్రాంగణంలో గణపతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోని విశిష్టతల్లో ఒకటి వివాద పరిష్కారానికి ఇక్కడి జైన కుటుంబ వారసుడే ధర్మాధికారిగా వ్యవహరిస్తారు.
ఆలయ దర్శన సమయాలు, ఉత్సవాలు
శ్రీ మంజునాథ స్వామి ఆలయం ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు తెరుచుకుంటుంది. శుద్ధి అనంతరం ఉదయం 6:30 నుంచి 11:00 గంటల వరకూ భక్తులు స్వామిని దర్శించవచ్చు. ఉదయం 11:30కి శివుడికి నైవేద్యం సమర్పించడంతో అన్నదానం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం మళ్లీ 2:15 వరకు దర్శనాలు కొనసాగుతాయి. సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 8:30 వరకూ భక్తులకు ఆలయం తెరిచి ఉంటుంది. 8:30కి మళ్ళీ మహాపూజ జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి, నవరాత్రులు, కార్తీక మాసం, మహాశివరాత్రి, ఉగాది వంటి పండుగలను ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఏప్రిల్ నెలలో వార్షిక జాతర జరగడం ధర్మస్థల ఆలయ విశిష్టాంశాల్లో ఒకటి. కాగా, ధర్మస్థల మంగళూరుకు సమీపంలో ఉంది. మంగళూరు నుంచి బస్సులు లేదా టాక్సీల ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. వసతి సౌకర్యాలు ఆన్లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే అక్కడకు చేరిన తర్వాత కూడా మంచి వసతులు లభిస్తాయి.
Read Also: Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు