TTD: కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం, మాడ వీధుల్లో వాహనసేవ!

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 06:53 PM IST

TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం ఉదయం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

ఇక ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని ఎస్వీ యూనివ‌ర్శిటి విశ్రాంత ఆచార్యులు స‌ర్వోత్త‌మ‌రావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సోమ‌వారం ఘ‌నంగా ముగిశాయి. ఈ సందర్భంగా జ‌రిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య స‌ర్వోత్త‌మ‌రావు ”అన్నమయ్య – ప్ర‌భోద‌ము ” అనే అంశంపై ఉపన్యసించారు. శ్రీ వేంకటేశ్వరుని నామంతో విశేషాలు, ఉత్స‌వాలతో భక్తజనానికి వీనులవిందుగా అన్నమయ్య కీర్త‌న‌లు ర‌చించిన‌ట్లు తెలిపారు.