Site icon HashtagU Telugu

Sravana Masam 2023 : నేటి నుండి శ్రావణమాసం మొదలు..ఇక ప్రతి ఇల్లు భక్తి పరవశమే

Sravana Masam Starts

Sravana Masam Starts

నేటి నుండి (ఆగస్టు 17) శ్రావణమాసం (Sravana Masam 2023) మొదలు. పంచాంగ ప్రకారంగా ఆగస్టు నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చిందని చెపుతుంటారు. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు.

వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పండితులు సూచిస్తారు. శ్రావణమాసం ఆగస్ట్ 17 నుండి మొదలై సెప్టెంబరు 15 శుక్రవారం వరకూ ఉంటుంది. ఈ స్వచ్ఛమైన శ్రావణ మాసంలో వివిధ పండుగలు జరుపుకుంటారు. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో ప్రత్యేక పూజలతో కిటకిటలాడుతుంటాయి. ఈ మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకతే.

శ్రావణమాసం (Sravana Masam )లో సోమవారం శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠులుడికి ప్రత్యేక పూజలు, గురువారం గురుదేవుడికి ఆరాధన, శుక్రవారం లక్ష్మీదేవి పూజలు, శనివారం హనుమంతుడికి, తిరుమలేశుడికి, శనీశ్వరునికి పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే ఈ మాసంలో నాగపంచమి, పుత్త్రైకాదశి, వరలక్ష్మీవ్రతం, రాశీ పున్నమి, రుషిపంచమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇలా ఎన్నో పండగలు వస్తాయి.

ఇక శ్రావణమాసం (Sravana Masam ) వచ్చిందంటే చాలు ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అంత సంతోషంగా గడుపుతుంటారు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

అలాగే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. శ్రావణమాసంలో చాలామంది ఉపవాసం ఉంటారు. మాంసాహారం, మద్యపానానికి దూరంగా నెలరోజుల పాటు శాఖాహారం పాటిస్తుంటారు. మరికొందరు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సో మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో శ్రావణ మాసాన్ని ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మీ hashtagu టీం కోరుకుంటుంది.

Read Also : Wife Complaint : భర్త ఆ టైపు అని తెలిసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన భార్య