శ్రావణ మాసం (Sravana Masam) 2025 ఈరోజు నుంచి ప్రారంభమైంది. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణం ఒకటి. ఈ మాసంలో లక్ష్మీ, నారాయణుల ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. పండితులు చెప్పిన ప్రకారం.. ఈ నెల రోజులు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తే కుటుంబానికి శుభఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రవారాల్లో మహిళలు తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొత్తగా పెళ్లైన వారు మంగళగౌరీ వ్రతాన్ని ప్రతి మంగళవారం ఆచరిస్తే భోగభాగ్యాలు, సౌభాగ్యం వస్తాయని విశ్వాసం ఉంది.
శ్రావణ మాసంలో దేవతలకు నైవేద్యంగా శుద్ధమైన ఆహారమే సమర్పించాలి. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి రజోగుణ, తమోగుణ అంశాలను దూరంగా ఉంచడం ధర్మసూత్రాల్లో చెప్పబడింది. ఇది ఆధ్యాత్మికంగా శరీరాన్ని, మనస్సును పరిశుద్ధంగా ఉంచేందుకు ఒక పద్ధతి. గృహస్తులు వ్రతాలు చేస్తూ ఈ మాసంలో సాధన చేయడం వల్ల కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం నెలకొంటుంది. అలాగే గోపద్మ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, రక్షాబంధన్ వంటి పర్వదినాలు కూడా ఈ మాసంలో జరగడం విశేషం.
AP Cabinet : ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాది.. కేబినెట్ కీలక నిర్ణయాలు, లక్షకు పైగా ఉద్యోగాలు
వైద్యపరంగా చూసినా శ్రావణ మాసంలో మాంసాహారం తీసుకోవడం మంచిదికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మన జీర్ణవ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో నాన్ వెజ్ ఆహారం తినడం వల్ల అజీర్తి, కడుపునొప్పి, గ్యాస్, ఫుడ్ పొయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఆరోగ్య పరంగా కూడా ఈ మాసంలో తేలికపాటి, శాకాహారమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
అందువల్ల శ్రావణ మాసం ప్రారంభమైన ఈ రోజునుంచి భక్తులు శుద్ధంగా జీవిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాలి. సత్యం, శాంతి, అహింస పథంలో నడుచుకుంటూ పూజలు, జపాలు చేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే అవకాశముంటుంది. ఇంట్లో లక్ష్మి కటాక్షం నిలవాలంటే శ్రద్ధగా ఈ మాసాన్ని గడపాలి. శ్రావణ మాసంలో చేసే ప్రతి మంచి కార్యానికి విశేష ఫలితం లభిస్తుందని హిందూ ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి.