. మండమెలిగే పండుగతో జాతరకు శుభారంభం
. ఆదివాసీ విశ్వాసాలు, సంప్రదాయాల ప్రతిబింబం
. మేడారం జాతర ప్రధాన ఘట్టాలు, భక్తుల సందడి
Medaram Jatara 2026: తెలంగాణ సంస్కృతీ వైభవానికి ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు బుధవారం తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. గిరిజన సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘మండమెలిగే’ పండుగతో జాతర సందడి మొదలైంది. దీనిని ఆదివాసీలు జాతరలో తొలి దశగా భావిస్తారు. ఈ పండుగ ప్రారంభం కావడంతోనే మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలివస్తుండగా మండమెలిగే పండుగ అనంతరం ఈ రద్దీ మరింత పెరిగే అవకాశముంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగగా గుర్తింపు పొందింది. ఈ మహాజాతరకు వారం రోజుల ముందు నిర్వహించే మండమెలిగే పండుగను ‘మినీ మేడారం’గా కూడా పిలుస్తారు. జాతరపై చెడు దృష్టి, దుష్టశక్తుల ప్రభావం పడకుండా నివారించడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేక ఆచారాలు, పూజలు నిర్వహిస్తారు.
మండమెలిగే పండుగ జాతరకు ముందు వచ్చే బుధవారం నాడు జరుగుతుంది. అంటే సమ్మక్క–సారలమ్మ దేవతలు అడవిలో నుంచి భక్తుల మధ్యకు వచ్చి దర్శనమిచ్చే ఏడు రోజుల ముందు నుంచే ఆ ప్రాంతాన్ని దుష్టశక్తుల నుంచి రక్షించే అష్టదిగ్భంధనం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఈ పండుగ ఆదివాసీల కుటుంబ వ్యవస్థలో కుమార్తెలకు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యతను కూడా చాటుతుంది. చెడుదృష్టిని నివారించి కుమార్తెలను ఘనంగా ఆహ్వానించడమే ఈ పండుగ అంతర్లీన భావన. ఈ సందర్భంగా మేడారంలోని సమ్మక్క ఆలయం కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాలను జంపన్నవాగు నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. మామిడి ఆకులు, గుమ్మడి కాయలు, ఎర్ర మిరపకాయలు, కోడి పిల్లతో ప్రత్యేకంగా అలంకరించిన తోరణాలను ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ దుష్టశక్తులను తరిమికొట్టేందుకు ఆదివాసీలు అనుసరించే సంప్రదాయ పద్ధతులు. ఆలయాల్లో పూజారులు అత్యంత రహస్యంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో బయటి వారికి ప్రవేశం ఉండదు. డోలు, వాయిద్యాల మోతతో ఆలయ పరిసరాల్లో పండుగ ప్రారంభమైన సంకేతం ఇస్తారు. ఈ రోజు నుంచి జాతర ముగిసే వరకూ పూజారులు కఠిన నియమాలు పాటిస్తారు.
మండమెలిగే పండుగకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర తొలి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను కొండపై నుంచి గోవిందరాజును పెనుగొండ నుంచి పగిడిద్దరాజును మేడారానికి తీసుకొస్తారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించాక భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. మండమెలిగే పండుగ అనంతరం జాతరలోని ప్రధాన ఘట్టాలు వరుసగా కొనసాగుతాయి. మొదటి రోజు సారలమ్మ గద్దెపైకి రాక రెండో రోజు చిలకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్క ఆగమనం మూడో రోజు గద్దెలపై అమ్మవార్ల కొలువు భక్తులకు దర్శనం జరుగుతాయి. నాలుగో రోజు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ మహాజాతర సందర్భంగా మేడారం అడవులు భక్తిశ్రద్ధలతో గిరిజన సంప్రదాయాల సువాసనతో పరిమళిస్తాయి.
