నేడు ఆఖరి శ్రావణ సోమవారం కావడం తో దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆఖరి శ్రావణ సోమవారం తో పాటు సోమావతి అమావాస్య (Somvati Aamavasya) కూడా. ఈ రెండు శివయ్య (Shivudu)కు అత్యంత ప్రీతికరమైన రోజులు. దీంతో ద్వాదశ జ్యోతిర్లింగాలు సహా అన్ని పవిత్ర క్షేత్రాల్లో బోళా శంకరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉజ్జయిని మహాకాలుడికి భస్మహారతి ఇచ్చారు. కాశీ విశ్వనాథుడిని పంచామృత స్నానానంతరం గంగా జలాలతో అభిషేకించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే… సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు. ఈ అమావాస్య రోజు మౌనవ్రతం పాటిస్తే వెయ్యి గోవులు దానం చేసిన ఫలం లభిస్తుందని గ్రంథాల్లో ఉంది. ఈరోజు రావిచెట్టును పూజిస్తారు. చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు. రావి, వేప చెట్లు కలిసి ఉన్న చోట కోరికలు చెప్పుకుంటూ కొమ్మలకు తోరాలు కడతారు. ఇలా చేస్తే ఎలాంటి కోరికలైనా తీరతాయని నమ్మకం.
అత్యంత అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని, దారిద్య్ర బాధలను పోగొడుతుందని విశ్వాసం. సోమావతి అమావాస్య పూజను ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటలు లేదా 9 గంటల నుంచి 10:30 గంటల లోపు చేసుకోవాలి. ఉదయం వీలుకానివారు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు చేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి, కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది.
Read Also : somvati amavasya special