హిందువులు మాఘమాసంలో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఏడాదిలో ప్రతి నెలలో శివరాత్రి వస్తుంది. కానీ ఏడాదికి ఒకసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ రోజున ఆ భోళా శంకరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మామూలుగా అన్ని పండుగలు పగలు సమయంలో జరుపుకుంటే మహాశివరాత్రి పండుగలు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరుపుకుంటాం. అయితే ఈ మహాశివరాత్రి రోజు తప్పకుండా మూడు రకాల విషయాలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు విషయాలు ఏమిటి? వాటిని పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. ఈ మహా శివరాత్రి పండుగ రోజు పగలంతా ఉపవాసం ఉండి, మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం నిద్రపోకుండా జాగరణ చేస్తూ మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది.
మహా శివరాత్రి రోజు బ్రహ్మ మూహూర్తంలో నిద్రలేచి ఇల్లంత శుభ్రపరచుకుని శుభ్రంగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజగదిలో ముగ్గులు వేసుకుని రక రకాల పూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత శివలింగానికి జలం, ఆవుపాలు, పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మి పూలను, గోగుపూలు, తెల్లని, పచ్చని పూలతో శివనామాలను కాని లేదంటే పంచాక్షరీ మంత్రమైన “ఓం నమశ్శివాయ “అనే మంత్రాన్ని స్మరిస్తూ ఆ శివయ్యకు పూజ చేయాలి.
తాంభూలం, చిలకడ దుంప, అరటి పండు, జామపండు, ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్టతో శివ అష్టోత్తరం లేదా శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రాతఃకాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయట. ఆ పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వరాలు, సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయట. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివున్ని అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.
కాగా శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివున్ని బోళాశంకరుడని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందవచ్చట.