కార్తీక మాసోత్సవాల్లో (Karthika Masam) భాగంగా అన్ని శైవక్షేత్రాలు (Shiva Temple) భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తుతూ… ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన గుంటూరు జిల్లా అమరావతి, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం, సామర్లకోట, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం తదితర క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
తెలంగాణలోనూ కీసర, వేములవాడ, కాళేశ్వరం సహా ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తాత్కాలికంగా సర్వదర్శనాలను రద్దు చేశారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం భక్తులు సుమారు 5 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ అధికారులు భక్తుల కోసం తాగునీరు, చలివేంద్రం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడమే కాకుండా, రద్దీని నిర్వహించేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
కార్తీక మాసం శివభక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన సమయం కాబట్టి, వచ్చే రోజులలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తులు అశ్వమేధం, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.