దేవీ నవరాత్రులు మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పెద్దపెద్ద ఆలయాలు నవరాత్రుల ఉత్సవాలకు ముస్తాబు అవుతున్నాయి. ఇకపోతే ఈ ఏడాది శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ మత విశ్వాసం ప్రకారం దేవీ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. అయితే ఈ నవరాత్రులలో పూజలు చేయడం మంచిదే కానీ తెలిసి తెలియకుండా చిన్నచిన్న పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు.
మరి దేవి నవరాత్రులలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దుర్గా దేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు పువ్వులు సమర్పించాలి. ఎరుపు రంగు బట్టలు సమర్పించాలి. నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పుజిస్తారు. దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. నవరాత్రులలో ప్రతిరోజూ దుర్గాదేవి మంత్రాలను పఠించాలి. అలాగే ధ్యానం చేయాలి. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు.
అలాగే నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి లేదా సేవ చేయడం మంచిదట. ఇది చాలా ధర్మబద్ధమైన చర్యగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. అలాగే పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయట. మరి ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..నవరాత్రులలో 9 రోజులు అఖండ జ్యోతిని వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఎవరైనా అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ జ్యోతిని ఆరిపోనివ్వకుండా జాగ్రత్త పడాలి. నవరాత్రులు 9 రోజులలో పొరపాటున కూడా తామసిక ఆహారం తినకూడదు.
అలాగే మద్యం సేవించకూడదట. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండాలట. మంచి ఆలోచనలను అలవర్చుకోవాలని చెబుతున్నారు. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే పూజ సమయంలో క్రమశిక్షణను తప్పకుండా పాటించాలట. నవరాత్రులలో సూర్యోదయ సమయంలో నిద్ర లేవడం, దుర్గాదేవిని భక్తి శ్రద్దలతో పూజించడం మంచిదని చెబుతున్నారు.