Vijayawada : బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరగనున్న శాకంబరి ఉత్సవాలు ఈరోజు (జూలై 8) భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శ్రావణమాస ప్రారంభానికి ముందే జరిగే ఈ ఉత్సవాల్లో దుర్గమ్మను శాకంబరీ దేవిగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పూలతో అలంకరణలు చేపట్టారు. ఆలయ అర్చకులు, సేవాకార్యకర్తలు శాకంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవాలయం చుట్టూ పచ్చని అలంకరణలతో ప్రకృతి వాతావరణాన్ని తలపించేలా చేసిన తీర్పు భక్తులను ఆకట్టుకుంటోంది.
Read Also: Heart Attack : ఆరోగ్యంగా ఉన్నప్పటికీ “ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది?
ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలకూ వివిధ రకాల కూరగాయల దండలు, పండ్లతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ఇంద్రకీలాద్రి పర్వతం మొత్తం హరిత సౌందర్యాన్ని సంతరించుకుని శాకంబరి దేవి కరుణకు ప్రతిరూపంగా మారింది. దేవతల పాలనలో ప్రకృతిని సాకారం చేసిన శాకంబరీ అమ్మవారి కీర్తిని గుర్తు చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీ శీనునాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరి అలంకార దర్శనానికి తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రత దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఆలయ అలంకరణ, ప్రసాద తయారీ వంటి కార్యక్రమాల కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించామని ఆలయ అధికారులు తెలిపారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి దాతల సహకారంతో ఈ కూరగాయలు సేకరించారని చెప్పారు. వాటితో అమ్మవారికి అభిషేకాలు, అలంకారాలు, ప్రసాదాలు తయారు చేశారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శాకంబరి దర్శనం కోసం వచ్చిన భక్తులకు నీటి సదుపాయం, ధర్మశాలలు, వైద్య సేవలు వంటి అంశాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక మరియు అంతరాలయ దర్శనాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీతో శాకంబరి ఉత్సవాలు ముగియనుండగా, ఆ రోజున ప్రత్యేక మహా పూజలు, హోమాలు, పూర్ణాహుతులతో ఉత్సవాలను ముగించనున్నారు. ప్రకృతికి సమర్పణగా జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మికానందంతో పాటు పచ్చదనాన్ని పరిచయ పరుస్తున్నాయి.