రంగులు మన జీవితాల పై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వారంలో ఏడు రోజులు గ్రహం ప్రకారం ఆయా రంగుల దుస్తులు ధరించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. శని దేవుడిని న్యాయదేవుడుగా కర్మ ఫలాలలో ఇచ్చేవాడిగా పరిగణిస్తూ ఉంటారు. శని అనుగ్రహం ఉంటే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. అలాగే ఆయనకు ఆగ్రహం తెప్పిస్తే ఎంతటి కోటీశ్వరులు అయినా బీదవారు అవ్వాల్సిందే. అలా మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు శనీశ్వరుడు. శని దేవుడికి శనివారం చాలా ముఖ్యం.
శని అనుగ్రహం వల్ల వ్యక్తి జీవితంలో విజయం, శ్రేయస్సు, స్థిరత్వం వస్తుందట. అయితే శని చెడు దృష్టి జీవితంలో పోరాటాలు, ఇబ్బందులను పెంచుతుందట. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సరైన రంగు దుస్తులు ధరించడం మంచిది అని చెబుతున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మంచిదట. ఇకపోతే శనివారం రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి ఏ రంగు దుస్తులు ధరించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటగా ఏ రంగు దుస్తులు ధరించాలి అన్న విషయానికి వస్తే.. శనివారం నాడు ముదురు రంగులు,గంభీరమైన వ్యక్తిత్వాన్ని చూపే రంగుల దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుందట. ముఖ్యంగా నలుపు, ముదురు నీలం, ముదురు గోధుమ, ఊదా రంగు దుస్తులు ధరించడం వల్ల శని నుండి సానుకూల శక్తి లభిస్తుందట.
ఈ రంగులు శని దేవుడికి ప్రియమైనవని, ఆయన చల్లని చూపును బలపరుస్తాయని,శనివారం నాడు ఈ రంగుల దుస్తులను ధరించినప్పుడు, శని దేవుడి శక్తి జీవితంలో అడ్డంకులను తగ్గించి, పనిలో విజయాన్ని తెస్తుందని చెబుతున్నారు. తెలుపు, గులాబీ, లేత నీలం లేదా లేత ఆకుపచ్చ వంటి లేత, ప్రకాశవంతమైన రంగులను ధరించకుండా ఉండాలట. ఈ రంగులు శని ప్రభావాన్ని బలహీనపరుస్తాయని, అలాగే జీవితంలో ఇబ్బందులను తెస్తాయని చెబుతున్నారు. ఇకపోతే శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి కొన్ని ప్రత్యేక పనులు కూడా చేయవచ్చని, శనివారం ఉదయం స్నానం చేసి రావి చెట్టుకు నీళ్ళు అర్పించడం చాలా పవిత్రం అని చెబుతున్నారు. ఈ నీటిలో గంగా జలం, నల్ల నువ్వులు, చక్కెర, పాలు కలిపిన నీటిని సమర్పించడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడట. అలాగే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను పూజించడంతో పాటు దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
శనివారం నాడు నిరుపేదలకు మినపప్పు, నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు, ఆవాల నూనె, నల్ల బట్టలు, బూట్లు వంటివి దానం చేయడం వల్ల శని దేవుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయట. అదేవిధంగా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం శనివారం రోజు కనీసం ఐదు సార్లు శని దేవుడు మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు. శని దేవుడి మంత్రాన్ని 11 లేదా 19 సార్లు జపించవచ్చట. అలాగే శనివారం రోజు శనీశ్వరుడి ఆలయంలో ఆవనూనె దీపాన్ని వెలిగించడం చాలా మంచిదని దీనివల్ల జీవితంలో సమస్యలు క్రమంగా తొలగిపోతాయని పనిలో విజయం చేకూరడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అలాగే ఎవరైనా శని దోషం, ఏలినాటి శని, శని మహాదశ వంటి వాటితో బాధపడుతున్నట్లయితే వారు శనివారం నాడు నల్ల కుక్క, ఆవు లేదా కాకికి ఆహారం పెట్టాలట. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి శని దేవుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయని చెబుతున్నారు.