1903-04 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులు ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడి, పగుళ్లు ఏర్పడటంతో, అది కూలిపోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ హాల్‌లోకి భక్తులకు గానీ, సందర్శకులకు గానీ ప్రవేశం లేదు.
ప్రస్తుతం ఏఎస్ఐ, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల బృందం ఈ క్లిష్టమైన పనిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తోంది. రాళ్లలో సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయని, ఒకేసారి ఇసుకను తొలగిస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని ఐఐటీ నివేదిక హెచ్చరించింది. దీంతో, దశలవారీగా ఇసుకను తొలగిస్తూ, ఎప్పటికప్పుడు రాళ్లకు సపోర్ట్ ఇస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే జీరో-వైబ్రేషన్ డైమండ్ డ్రిల్ టెక్నాలజీతో రాళ్ల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషించారు. నిర్మాణంపై ఒత్తిడిని పర్యవేక్షించేందుకు 40 హై-ప్రెసిషన్ సెన్సార్లు ఏర్పాటు చేశారు.
తాజ్‌మహల్ తర్వాత దేశంలో అత్యధికంగా సందర్శకులను ఆకర్షిస్తున్న స్మారకాల్లో కోణార్క్ రెండోది. ఏటా 35 లక్షల మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆపరేషన్ విజయవంతమైతే, 122 ఏళ్ల తర్వాత తొలిసారిగా భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. ఆలయానికి మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్షును అందించడమే తమ లక్ష్యమని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. ఈ చారిత్రక ఘట్టం ఆలయానికి కొత్త జీవం పోస్తుందని భక్తులు, పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
