Site icon HashtagU Telugu

Sakat Chauth 2023: నేడు సంక‌ష్టి చ‌తుర్థి.. ఈ తప్పులు చేయొద్దు సుమా..!!

Sakat Chauth

Resizeimagesize (1280 X 720) (2) 11zon

నేడు సంక‌ష్టి చ‌తుర్థి. దీన్నే మాఘ చతుర్థి అని కూడా అంటారు.ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగి పోతాయని ప్రజల విశ్వాసం. భక్తి శ్రద్ధలతో గణేష్ చతుర్థి వ్రతాన్ని, ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల పిల్లలకు దీర్ఘాయువు, ఆనందం, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.ప్రతి నెల సంక‌ష్టి చ‌తుర్థిని వ్రతాన్ని చేయడం వల్ల అదృష్టాన్ని కూడా పొందుతారు.

శుభ సమయం ఇదీ..

సంక‌ష్టి చ‌తుర్థి ఉపవాసం జనవరి 10న అంటే ఈ రోజున ఆచరిస్తారు. ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజున మహిళలు తమ పిల్లల కోసం ఉపవాసం ఉండి గణేశుడిని ప్రార్థిస్తారు. సంక‌ష్టి చ‌తుర్థిని హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. దీని శుభ సమయం జనవరి 10న అంటే ఇవాళ మధ్యాహ్నం 12.09 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది జనవరి 11, 2023న అంటే రేపు మధ్యాహ్నం 2.31 గంటలకు ముగుస్తుంది.  రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఈ ఉపవాసం విరమించబడుతుంది. ఈరోజు చంద్రోదయం సాయంత్రం 08:41 ని.లకు ఉంది.

పూజా విధానం..

సంక‌ష్టి చ‌తుర్థి పూజా విధానం విషయానికి వస్తే.. ఈ రోజు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకోండి. దీని తరువాత గణేశుడిని పూజించండి. పూజ సమయంలో గణేశుడికి నువ్వులు, బెల్లం, లడ్డూలు, దుర్వ , చందనం, మోదకం సమర్పించండి.  ఆ తర్వాత శ్రీ గణేష్‌ని స్తుతించి మంత్రాలు పఠించండి. రోజంతా పండ్లతో ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రోదయానికి ముందు వినాయకుడిని పూజించండి. చంద్రోదయం తరువాత చంద్రుడిని చూసి అర్ఘ్యం సమర్పించండి. చంద్రునికి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు సమర్పించాలి. దీని తర్వాత ఉపవాసం ముగించాలి.

ఇవాళ ఈ తప్పులు చేయకండి

* గణపతికి తులసిని అర్పించకండి

సంక‌ష్టి చ‌తుర్థి రోజున తులసిని వినాయకుడికి సమర్పించకూడదు.  పురాణాల ప్రకారం, తులసి మాత వివాహ ప్రతిపాదనను గణేశుడు తిరస్కరించారు. ఆ తర్వాత తులసి మాత, గణేశుడిని రెండు పెళ్లిళ్లు జరగాలని శపిస్తుంది. అప్పుడు గణేశుడు.. తులసి మాతకు రాక్షసుడితో వివాహం జరగాలని శపించారు. అందుకే తులసిని గణేష్ పూజలో ఉపయోగించరు.

* ఎలుకలకు అంతరాయం కలిగించవద్దు 

ఈ రోజున ఉపవాసం పాటించే వ్యక్తులు గణేశుడి వాహనంగా ఉండే ఎలుకలను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల గణేశుడికి కోపం వస్తుంది.

* నల్లని దుస్తులు ధరించవద్దు 

ఉపవాస సమయంలో స్త్రీలు పొరపాటున కూడా నల్లని బట్టలు ధరించకూడదు. ఈ రోజు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.

* అర్ఘ్యం పాదాలపై పడకూడదు

పూజ చేసే క్రమంలో పాలు, అక్షతలను నీటిలో కలిపి చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. అయితే అర్ఘ్యం ఇచ్చే సమయంలో అర్ఘ్య జలం పాదాలపై పడకూడదని గుర్తుంచుకోండి.

సంక‌ష్టి చ‌తుర్థి ఉపవాస కథ

ఈ రోజున గణేశుడు తన జీవితంలోని అతిపెద్ద సంక్షోభం నుండి బయటపడ్డాడు. అందుకే దీన్ని సంక‌ష్టి చ‌తుర్థి అంటారు. పురాణాల ప్రకారం.. ఒకసారి తల్లి పార్వతి స్నానానికి వెళ్ళినప్పుడు, ఆమె గణేశుడిని ఇంటికి కాపలాగా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వకూడదని చెబుతుంది. దీంతో సాక్షాత్తు శివుడు రాగానే లోపలికి రాకుండా గణపతి ఆపుతాడు. దీంతో శివుడు కోపించి తన త్రిశూలంతో వినాయకుని తల నరికాడు. కుమారుడి పరిస్థితిని చూసి తల్లి పార్వతి రోదిస్తూ తన కొడుకును బతికించాలని పట్టుబట్టింది. తల్లి పార్వతి శివునికి చాలా అభ్యర్థనలు చేసినప్పుడు, గణేశుడికి ఏనుగు తలపై పెట్టడం ద్వారా రెండో జీవితాన్ని శివుడు ప్రసాదిస్తాడు. అప్పటి నుండి గణేశుడిని గజాననుడు అంటారు. ఆ రోజు నుంచే గణపతిదేవుడు కూడా ప్రథమ పూజకుడనే విశిష్టతను పొందాడు. సంక‌ష్టి చ‌తుర్థి రోజునే గణేశుడు 33 కోట్ల దేవతల అనుగ్రహాన్ని పొందాడు. అప్పటి నుంచి ఈ తేదీ గణపతి పూజకు సంబంధించిన తేదీగా మారింది. ఈ రోజున గణపతి ఎవరినీ ఖాళీ చేతులతో వెళ్లనివ్వడని చెబుతారు.

Exit mobile version