ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి ఈ ఏడాది కార్తీకమాసం అసాధారణమైన రీతిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు సగర్వంగా ప్రకటించారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, గత 33 రోజుల్లో (అక్టోబర్ 23, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు) భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ ప్రాంగణంలో పటిష్టమైన భద్రత మధ్య లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 7,27,26,400/- (ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు) నగదు రూపంలో లభించింది. శ్రీశైల క్షేత్ర చరిత్రలో ఒకే కార్తీకమాసంలో ఇంత భారీ మొత్తం రావడం ఇదే ప్రథమం అని అధికారులు తెలిపారు.
Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం
ఈ ఏడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయం గత సంవత్సరం కంటే గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే కార్తీక మాస సీజన్‌లో ఆలయానికి రూ. 5,96,92,376/- ఆదాయం లభించగా, ఈసారి అది రూ. 7.27 కోట్లకు చేరుకుంది. అంటే, గత సంవత్సరం కంటే ఏకంగా రూ. 1,30,34,024/- (ఒక కోటి ముప్పై లక్షల ముప్పై నాలుగు వేల ఇరవై నాలుగు రూపాయలు) అదనంగా రావడం విశేషం. ఈ గణాంకాలు శ్రీశైలం క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల తాకిడిని, అలాగే భక్తుల భక్తిభావాన్ని, విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నగదుతో పాటు, భక్తులు స్వామి అమ్మవార్లకు విలువైన ఆభరణాలను కూడా కానుకగా సమర్పించారు. ఇందులో 117 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం మరియు 7 కిలోల 230 గ్రాముల వెండి లభించాయి.
శ్రీశైల మల్లికార్జున స్వామివారికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. హుండీ లెక్కింపులో పలు దేశాల కరెన్సీ నోట్లు లభ్యం కావడం దీనికి నిదర్శనం. ముఖ్యంగా అమెరికా ($646), యు.ఎ.ఈ (120 దిర్హమ్స్), సౌదీ అరేబియా (85 రియాల్స్), ఖతార్ (136 రియాల్స్), సింగపూర్ ($30), ఇంగ్లాండ్ (£85), ఒమన్ (200 బైంసా), ఆస్ట్రేలియా ($25) కరెన్సీ నోట్లు లభించాయి. హుండీల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాలో ఈఓ శ్రీ యం. శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో ఆర్. రమణమ్మ, ఇతర అధికారులు, సిబ్బంది మరియు శివసేవకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
