Ganesh Temple : ఉత్తరాల గణపయ్య.. ఈ ఆలయం గురించి తెలుసా ?

ఈ సమయంలో రాజుగారికి గణేశుడు కష్టకాలంలోకనిపించి కోటగోడలో అజ్ఞాతంగా ఉన్న విగ్రహాన్ని తీసి పూజించాలని ఆదేశించాడట. ఆ ప్రదేశాన్ని గుర్తించిన రాజు.. కోటగోడను పగలకొట్టించగా..

Published By: HashtagU Telugu Desk
ranathambore trinetra ganesh temple

ranathambore trinetra ganesh temple

Ganesh Temple : భారతదేశం.. అనేక విశేష ఆలయాలకు నెలవు. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర. ఒక్కో దేవుడికి ఒక్కో మహిమ. వాటిలో ఒకటి ఉత్తరాల గణపయ్య ఆలయం. కొత్తగా ఉంది కదా. భక్తులు ఎవరికైనా సమస్య వస్తే..దానికి సరైన పరిష్కారం దొరకని పక్షంలో గణపతికి ఒక ఉత్తరం రాసి హుండీలో వేస్తే చాలు. గణపయ్యే దానికి పరిష్కారం చూపిస్తాడని నమ్మకం. ఈ ఆలయం పేరు త్రినేత్ర గణపతి ఆలయం.

రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లా.. రణథంబోర్ లో ఉందీ ఉత్తరాల గణపతి ఆలయం. దీనిని రణభన్వర్ ఆలయం అని కూడా అంటారు. దేశంలోనే తొలి గణేశ ఆలయంగా చెబుతారు. ఆరావళి, వింధ్య పర్వతాల మధ్య ఉన్న సంగమ స్థానంలో ఈ ఆలయం ఉంది. ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మొదట ఈ స్వామికే ఆహ్వానం పంపుతారు.

1299-1301 మధ్యకాలంలో స్థానిక పాలకుడైన మహారాజా హమీర్ దేవ్ చౌహాన్, ఢిల్లీ పాలకుడైన అల్లాఉద్దీన్ ఖిల్జీలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఖిల్జీ సేనలు నెలల తరబడి రణథంబోర్ కోటను ముట్టడించాయి. కొండమీద ఉన్న కోటలో నిత్యావసరాలన్నీ నిండుకున్నాయి.

ఈ సమయంలో రాజుగారికి గణేశుడు కష్టకాలంలోకనిపించి కోటగోడలో అజ్ఞాతంగా ఉన్న విగ్రహాన్ని తీసి పూజించాలని ఆదేశించాడట. ఆ ప్రదేశాన్ని గుర్తించిన రాజు.. కోటగోడను పగలకొట్టించగా.. అక్కడ గణపతి విగ్రహం కనిపించింది. ఆ మరుసటిరోజే ఖిల్జీసేనలు విచిత్రంగా.. ఆ ప్రాంతాన్ని వదిలేసి వెనుదిరిగి వెళ్లిపోయారట.

అలాగే.. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పెళ్లాడే సమయంలో.. విఘ్నాధిపతిని ఆహ్వానించడం మరిచిపోయాడని చెబుతారు. దాంతో.. పెళ్లికి బయల్దేరిన కృష్ణుడి రథాన్ని ముందుకు సాగనివ్వకుండా దారిపొడవునా కోతులు పెద్దపెద్ద గుంతలు తవ్వాయట. అందుకు కారణం తెలుసుకున్న కృష్ణుడు గణపయ్యను క్షమాపణ కోరడంతో పాటు.. వివాహపు శుభలేఖను కూడా పంపించాడట.

బుధవారం గణపయ్య దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. ఇది టైగర్ రిజర్వ్ ప్రాంతం మధ్యలో ఉండటంతో.. ఆలయం చుట్టూ వృక్షసంపద చాలా బాగుంటుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడి వృక్షసంపదను చూసి మంత్రముగ్ధులవుతుంటారు.

ఈ ఆలయానికి వెళ్లాలంటే.. రైలులో సవాయి మాధోపూర్ స్టేషన్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. మీకేమైనా తీరని సమస్యలు ఉన్నా, గణపయ్యకు ఆహ్వానం పంపాలనుకున్నా రణథంబోర్ త్రినేత్ర గణేశ ఆలయం, సవాయి మాధోపూర్, రాజస్థాన్ -322021 అనే అడ్రస్ కు పంపి ఆ గణపయ్య ఆశీస్సులు పొందవచ్చు.

 

  Last Updated: 22 Oct 2023, 03:50 PM IST