చిలుకూరు బాలాజీ ఆలయ (Chilukur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Rangarajan)పై దాడి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి “రామరాజ్యం”(Rama Rajyam)వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డి (Veera Raghavareddy) అరెస్టు అయ్యాడు. ఆలయ భూముల పై ఆధిపత్యం కోసం ఆయన ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ భూములను తమ ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే రంగరాజన్‌పై ఆయన దాడికి పాల్పడ్డారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వీర రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న జీయర్ స్వామిని టార్గెట్ చేస్తూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తెరపైకి వచ్చింది. “గోత్రాలను సంకరం చేస్తారా చిన్న జీయర్?” అంటూ ఆయన ఆరోపణలు చేసిన వీడియో మరింత వైరల్ అవుతుంది. ఇందులో రామానుజ గోత్రాల మార్పు, హిందూ సంప్రదాయాల మీద జరిగిన వ్యాఖ్యలు భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వీర రాఘవరెడ్డి గత కొన్ని నెలలుగా 27,800 గ్రామాల నుంచి ప్రతి ఊరి నుండి ఒక్కో హిందూ సైనికుడు తనతో రావాలని పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి నిజమైన ఉద్దేశం ఆలయాల భూములపై హక్కులు సాధించడమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిలుకూరు ఆలయ ఘటన ఈ కుట్రలో భాగమేనని భక్తులు భావిస్తున్నారు.
కాగా ఈ వివాదంపై చిన్న జీయర్ స్వామి కూడా స్పందించారు. “రామరాజ్యం సాధించడం కష్టం కాదు, కానీ హింసాత్మక మార్గంలో సాధించేది కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. దేవాలయాల పేరుతో హింస చెలరేగడం హిందూ ధర్మానికి మచ్చ అని స్వామిజీ పేర్కొన్నారు. అలాగే భక్తులు సైతం “రామరాజ్యం” అనే పేరు ఉపయోగించి హింసాత్మక చర్యలకు పాల్పడడం హిందూ ధర్మానికి విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగరాజన్‌పై దాడిని ఖండిస్తూ హిందూ సంఘాలు, భక్తులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.