Ram Navami 2025: ఈసారి శ్రీరామ నవమి వేడుకలు ఏప్రిల్ 6న జరగబోతున్నాయి. ఆ రోజున అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. రామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలోని బాల రామయ్యకు ఒక గంట పాటు అభిషేకం చేయనున్నారు. అనంతరం బాల రామయ్య నుదుటిపై 4 నిమిషాల పాటు సూర్యతిలకం ప్రసరించనుంది. బాల రామయ్యకు 56 రకాల నైవేద్యాలను సమర్పించనున్నారు. ఈ వేడుకల కోసం శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు ఇవీ..
రామ నవమి రోజున అయోధ్య(Ram Navami 2025)కు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈనేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో చల్లదనం కోసం ఇప్పటికే అయోధ్య రామమందిరంలో మ్యాటింగ్ పని ప్రారంభించారు. చల్లటి నీటి వసతిని ఆలయంలో ప్రతిచోటా ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామయ్య దర్శన మార్గం వెంట దాదాపు 200 చల్లటి నీటి స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హారతి మొదలయ్యే సమయంలో భక్తులు ఆగే ప్రదేశాల్లో ఫ్యాన్లను, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాన్లు, కూలర్లు చల్లటి నీటిని చల్లుతుంటాయి. రోడ్లపైనా వివిధ ప్రదేశాలలో కూలర్లను ఏర్పాటు చేయనున్నారు.
Also Read :BRS Silver Jubilee : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ.. వేదిక ఫిక్స్ చేసిన కేసీఆర్
అయోధ్యలో శ్రీరామనవమి కార్యక్రమాలు
- ఏప్రిల్ 6న ఉదయం 9:30 గంటలకు అయోధ్యలోని బాల రామయ్యకు అభిషేకం ప్రారంభమవుతుంది.
- ఉదయం 10:30 గంటలకు గర్భ గుడి తలుపులు మూసివేసి, బాల రామయ్యకు అలంకరణ చేస్తారు.
- 10:50 గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకరణ దర్శనం జరుగుతాయి. ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
- 11:50 గంటలకు గర్భగుడి తలుపు మూసివేస్తారు. ప్రసాదం సమర్పణ కోసం సన్నాహాలు ప్రారంభమవుతాయి.
- 12:00 గంటలకు శ్రీరాముడి జన్మ దిన వేడుకలు మొదలవుతాయి. సూర్య తిలక ఘట్టం జరుగుతుంది. హారతి నిర్వహిస్తారు. ఈ టైంలో స్వామివారికి 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.