Ayodhya Ram : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనా మహోత్సవం జరిగి నేటికి(జనవరి 22) సరిగ్గా ఏడాది. 2024 సంవత్సరం జనవరి 22న స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో శ్రీరాముడిని ప్రతిష్ఠించారు. అయోధ్య రాముడిని బాల రాముడు (రామ్ లల్లా) అని పిలుస్తున్నారు. ఇవాళ అయోధ్య రామయ్య సన్నిధికి భక్తజనం పోటెత్తారు. ప్రత్యేక పూజల్లో రామయ్య భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభ మేళా జరుగుతోంది. మేళాకు వెళ్లే భక్తులు అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు వస్తున్నారు. దీంతో భక్తజనంతో అయోధ్య నగరం కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా జైశ్రీరామ్ నినాదాలు(Ayodhya Ram) చేసే భక్తులే కనిపిస్తున్నారు. ఈనేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో అయోధ్య రామమందిరాన్ని 6 జోన్లు, 17 సెక్టార్లుగా విభజించారు. భక్తుల సౌకర్యార్ధం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది.
Also Read :MF Husain Paintings : ఎంఎఫ్ హుస్సేన్ రెండు పెయింటింగ్‌లు సీజ్.. వాటిలో ఏముందంటే..
అమృతకాలంలో..
గత సంవత్సరం పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథిలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ తిథి ప్రకారం జనవరి 11వ తేదీనే అయోధ్య రాముడి ప్రతిష్ఠాపనా మహోత్సవ వార్షికోత్సవం జరిగింది. అయితే మహాకుంభ మేళా సందర్భంగా రామయ్య దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు. ‘‘ఇవాళ సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నాడు. దీనివల్ల ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు అమృతకాలం కొనసాగుతుంది. ఈ వ్యవధిలో రామయ్యను భక్తులు దర్శించుకుంటే చాలా పుణ్యం లభిస్తుంది’’ అని పలువురు జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
Also Read :Saif Ali Khans Property : సైఫ్ అలీఖాన్‌కు మరో షాక్.. రూ.15వేల కోట్ల ఆస్తి ప్రభుత్వపరం ?
‘‘వాస్తవానికి శ్రీరాముడి దేవతా మూర్తి ప్రతిష్ఠాపనకు ఒక ముహూర్తం అనేది ఉంటుంది. కానీ ఆయన దర్శనానికి ఎటువంటి ప్రత్యేకమైన ముహూర్తం ఉండదు. భక్తి భావం ఉంటే చాలు. ఆయన్ను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు’’ అని ఇంకొందరు జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు తెలిపారు. అయితే మహాకుంభ మేళా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రామయ్య దర్శనం అనేది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ప్రయాగ్ రాజ్ వరకు వచ్చిన భక్తులు.. అయోధ్య రామయ్యను దర్శించుకోకుండా వెనుదిరిగి వెళ్లలేరు.