మణికంఠుడు, పంబావాసుడు, హరిహరసుతుడిగా భక్తులు విశ్వసించే అయ్యప్పస్వామి ప్రధాన ఆలయం శబరిమలలో ఉంది. ఏటా కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం, నియమ నిష్టలతో మండల కాలంపాటు దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడితో భక్తులు శబరిమల యాత్రకు వెళ్లడం పరిపాటి. అయితే రాష్ట్రాలను దాటుకుని, రద్దీలో వెళ్లలేని భక్తుల కోసం ఇప్పుడు రాజమండ్రిలోనే అయ్యప్ప ఆలయాన్ని నిర్మించడం విశేషం.
ఉత్తర శబరిమలగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం మన రాజమండ్రి గోదావరి తీరాన కొలువై ఉందంటే నమ్ముతారా… ఈ మణికంఠుడి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు విధిగా జరుగుతున్నాయి. ఇది రాజమండ్రికే కాదు.. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ అయ్యప్పగుడి ఎంతో ప్రాచుర్యం పొందింది. సహజంగా అయ్యప్ప మాల ధరించే భక్తులు శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఇక్కడ కూడా ఇరుముడి సమర్పించే అతికొద్ది ఆలయాల్లో ఒకటి కావడం విశేషం.
Heavy Rains : ఏపీకి బిగ్ షాక్ ..నవంబర్ లో మరో మూడు తుఫాన్లు..!!
శబరిమలలో ఉన్నట్లే ఇక్కడ కూడా గణపతి దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, షిర్డిసాయి బాబా ఆలయం, లక్ష్మీహయగ్రీవ స్వామి, మాలికాపుర అమ్మవారు, దక్షిణామూర్తిస్వామి, దత్తాత్రేయ స్వామి వంటివి ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతినిత్యం ఘాట్‌కు వచ్చే సాధారణ భక్తులు, అయ్యప్ప భక్తుల రాకతో సందడిగా ఉంటుంది. శబరిమల అయ్యప్పకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా విధిగా పూజలు నిర్వహిస్తారు.
రాజమండ్రి అయ్యప్ప ఆలయం పూర్తిస్థాయిలో రాతి కట్టడం. ప్రత్యేక ఆకృతిలో ఉన్న రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణానికి తగినట్లుగా మలిచి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాభివృద్ధికి ఇతోదికంగా సాయం అందిస్తున్న జక్కంపూడి కుటుంబీకులు స్వామి వారి సేవే ప్రధాన లక్ష్యంగా స్వాముల కోసం ఖర్చు చేస్తున్నారు. 2011 మార్చి 20న ఇక్కడ అయ్యప్పమూర్తిని ప్రతిష్టించారు. అప్పటి ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహనరావు గారి భక్తి, స్ఫూర్తికి ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తోంది. స్థలాన్ని సేకరించి, నిర్మాణ వ్యయ బాధ్యతలను స్వీకరించి అయ్యప్ప ఆలయాన్ని తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుపొందిన అయ్యప్ప దేవాలయాల్లో రాజమండ్రిలోని ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయ నిర్మాణంలో రాజమండ్రికి చెందిన దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పాటు ఇతర దాతల సహకారం ఉన్నట్లు ఆయన కుమారుడు జక్కంపూడి రాజా చెబుతున్నారు. చాలామంది దీక్ష తీసుకోవాలన్నా శబరిమలకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. అక్కడకు వెళ్లలేనివారిని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి కోటప్పకొండ నుంచి శిలను తీసుకువచ్చారు. పంచలోహాలతో అయ్యప్ప స్వామి మూల విరాట్ విగ్రహాన్ని తయారు చేయించి అయ్యప్ప స్వామిని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.
ప్రతి ఏటా విజయదశమి నుంచి ప్రారంభమై.. జ్యోతి దర్శనం అయ్యేవరకు నిత్యదర్శనం, నిత్యఅన్నదానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, దీక్షా సామగ్రి, వసతులను కల్పించడంతో పాటు వాటిని ఇన్నేళ్లుగా నిలిపివేయకుండా కొనసాగిస్తూ, నిత్య అన్నదాన, పూజా కార్యక్రమాలను విధిగా నిర్వహిస్తూ, భక్తులకు మరో పరమావధిగా మలచడం ఎంతో విశేషం.
