Puri Idols Mystery : విశ్వకర్మ చెక్కి..బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన విగ్రహాలు

Puri Idols Mystery : పూరీ అంటే పూరించేది.. భక్తుల కోర్కెలు తీర్చేదని అర్ధం.భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు కాబట్టి  ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి ఆ పేరు వచ్చింది. జగన్నాధ స్వామి మహిమాన్విత విగ్రహంతో ముడిపడిన ఒక ఆసక్తికర స్థలపురాణం ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • Written By:
  • Updated On - June 19, 2023 / 04:46 PM IST

పూరీ పట్టణంలో పూరీ జగన్నాథుడి ఆలయం ఉంది. 

జగన్నాధ స్వామి మహిమాన్విత విగ్రహంతో ముడిపడిన ఒక ఆసక్తికర స్థలపురాణం ఇప్పుడు తెలుసుకుందాం.. 

జగన్నాథుడు నీలమాధవుడనే పేరుతోనూ పూజలందుకున్నాడని స్థలపురాణం చెబుతోంది.  అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని (Puri Idols Mystery) కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, విద్యాపతి  కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను తనకు గూఢచర్యం పని అప్పగించిన ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.ఆ రాజు అడవికి చేరుకునే లోగా ఆ విగ్రహాలు మాయమవుతాయి.

Also read : Vastu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఈ విగ్రహాలు ఉంచితే అదృష్టం తలుపు తడుతుంది.

విశ్వకర్మ వికలాంగుడి రూపంలో..  

దీంతో ఇంద్రద్యుమ్నుడు అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు.

చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు..

రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. దీంతో శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని చెబుతాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.