హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. ఈ పండుగను దాదాపు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అలంకరించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అమ్మవారు ఒకరోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఏ రోజు ఇలాంటి ప్రసాదాలు నైవేద్యాలను సమర్పించాలి అన్న విషయం తెలియదు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నవరాత్రులలో మొదటిరోజు శైలపుత్రి అమ్మవారి రూపంలో మనకు దుర్గామాత దర్శనమిస్తుంది. ఈరోజున అమ్మవారికి స్వచ్చమైన నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు. నేతిని అమ్మవారి పాదాలపై పోసి అభిషేకిస్తారు. ఇలా చేయటం వలన మీకున్న సకల రోగాలు,కష్టాలు తొలగిపోతాయట..
ఇక రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిని అమ్మవారిగా దర్శనం ఇస్తారు. ఈ రూపంలో పార్వతి అమ్మవారు పరమశివుని తిరిగి భర్తగా పొందటానికి తపస్సు చేసారు. ఉపవాసం ఉండి ఈమెను పూజిస్తారు. మీరు ప్రసాదంగా పంచదారను సమర్పించవచ్చు. ఇలా చేయటం వలన మీ కుటుంబంలో వారికి దీర్ఘాయువు కలుగుతుందట.
ఇక మూడవరోజు దుర్గామాత చంద్రఘంత అమ్మవారి రూపంలో దర్శనమిస్తుంది.చంద్రుడు నెలవంకగా కన్పించి అమ్మవారి తలపై ఉన్నట్లు భావిస్తారు. ఈ రూపాన్ని భక్తులు అన్ని లౌకిక బాధల నుంచి విముక్తికై పూజిస్తారు. ఈరోజున అమ్మకు పాలతో తయారుచేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రాహ్మణులకి అన్నదానం చేసి దక్షిణ ఇస్తారు. ఇలా చేస్తే అమ్మవారిని మెప్పి భక్తులకు సుఖసంతోషాలను వరంగా ఇస్తారట.
ఇక నాలుగో రోజు అమ్మవారు కూష్మాండా రూపంలో దర్శనమిస్తారు. ఈరోజున అమ్మవారికి మల్పువా నైవేద్యంగా సమర్పించడం మంచిది. కూష్మాండ అమ్మవారి కడుపులో నుంచి ఈ విశ్వం ఉద్భవించిందని నమ్ముతారు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి, అన్ని రోగాలు, బాధల నుంచి విముక్తి కావాలని ప్రార్థిస్తారు. మల్పువా కూష్మాండ అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు స్కంద మాత రూపంలో దర్శనం ఇస్తారు. స్కందమాత లేదా కార్తికేయుడి తల్లిగా ఆమె చాలా అందమైన రూపంలో ఉంటారు. ఈ రూపంలో ఆమె భక్తుల కోరికలన్నిటినీ తీరుస్తారు. ఈమెకి అన్నిటికన్నా అరటిపళ్ళ నైవేద్యం అంటే ఎంతో ప్రీతికరమట. ఈ నైవేద్యం మీకు అమ్మవారి ఆశీస్సులు, ఆరోగ్యకర జీవితంని అందిస్తాయని చెబుతున్నారు.
ఇక నవరాత్రులలో ఆరవ రోజు దుర్గ అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనం ఇస్తారు. ఈ రూపంలో అమ్మవారు, కాత్యాయన్ అనే మహర్షికి ఆయన తపస్సు ఫలితంగా జన్మించింది. అయితే కాత్యాయని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెను నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు.
ఇక ఏడవ రోజు అమ్మవారు కాళికా అమ్మవారిగా దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారికి బెల్లం ని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎటువంటి బాధలు ఉన్నా సరే ఉపశమనం లభిస్తుందట.
ఇక ఎనిమిదవ రోజు అమ్మవారు మహా గౌరీ రూపంలో దర్శనం ఇస్తారు. అన్నిటిలో విజయం కోసం ఈమెని పూజిస్తారు. మహాగౌరి అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు. బ్రాహ్మణులకి కొబ్బరికాయను దానంగా ఇవ్వవచ్చు. ఇవన్నీ చేయటం వలన సంతానం లేని జంటలకి మంచి సంతానం కలుగుతుందట.
ఇక చివరిగా తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధి ధాత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈమెకి నువ్వులను ప్రధాన నైవేద్యంగా సమర్పించడం మంచిది. భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. ఈ నైవేద్యం వలన భక్తుల మరణ భయం లేదా ఏదన్నా ప్రమాద భయం ఉన్న తొలగిపోతుందట.