ప్రాణహిత పుష్కరాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం అర్జునగుట్టలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఏప్రిల్ 24 వరకు జరగనున్న పుష్కరాలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని, మంచిర్యాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ఎమ్మెల్సీ దండే విఠల్ కూడా అర్జునుగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల సందర్భంగా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కొన్నేరు కోనప్ప కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మడిహట్టిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులకు అన్నదానం చేశారు.
చెన్నూరు నుంచి 20 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి అర్జునగుట్ట పుష్కరఘాట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మించారు. కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రెండు పుష్కరఘాట్లు సిద్ధం చేశారు. చలువపందిళ్లు, తాగునీరు, విద్యుత్తు, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా 9 కిలోమీటర్ల దూరంలోని సిరోంచకు వెళ్లేందుకు 10 ఉచిత బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి ఉంటాయి.