Site icon HashtagU Telugu

Conch: శంఖాన్ని ఇంట్లో ఆ దిశలో పెట్టి పూజిస్తే ఏమవుతుందో తెలుసా?

Conch

Conch

హిందువులు చాలామంది ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. పూజ ప్రారంభంలో అలాగే పూజ అయిపోయిన తర్వాత ఈ శంఖాన్ని ఊదుతూ ఉంటారు. ఇంట్లో శంఖాన్ని పూజించడం వలన ఎన్నో సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాదు శ్రేయస్సు లభిస్తుంది. శంఖం పూజ వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందట. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాన్ని వస్తే.. శంఖాన్ని ఇంటికి తూర్పు దిశలో ఉంచి పూజించాలి. పూజ గదిలో శంఖాన్ని ఉంచడం అత్యుత్తమైనదట. వాస్తు ప్రకారం పూజ గది ఈశాన్య మూలలో ఉండాలి.

ఇది కాకుండా శంఖాన్ని వాయువ్య దిశలో కూడా ఉంచి పూజించవచ్చట. శంఖాన్ని ఈ దిశలలో మాత్రమే ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీపై అపార కరుణ, కటాక్షాలను చూపిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే శంఖాన్ని ఉంచే స్థలం ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా నేలపై అస్సలు పెట్టకూడదు. శుభ్రమైన ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు తీసుకుని వాటిపై శంఖాన్ని పెట్టి పూజించడం మంచిది. పూజా అనంతరం శంఖంపై దుమ్ము ధూళి చేరకుండా ఎరుపు లేదా పసుపు వస్త్రంతో కప్పడం శ్రేయస్కరం. అలాగే మీరు ఇంట్లో శంఖాన్ని ఊదినట్లయితే, శంఖాన్ని ఊదిన తర్వాత శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచాలి.

శంఖం ఊదిన తర్వాత ఒక గిన్నెలో నీరు, గంగాజలం తీసుకుని అందులో శంఖాన్ని వేసి ఎండబెట్టి ఆలయంలో ఉంచాలి. శంఖాన్ని ఎప్పుడూ పైకి చూసేలా ఉంచి పూజించాలి. దీని కారణంగా, శంఖం నుండి వెలువడే సానుకూల శక్తి ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. శంఖాన్ని శ్రీమహా విష్ణువు, లక్ష్మి దేవి దగ్గర ఉంచినట్లయితే, దాని నుండి లభించే సానుకూల ప్రభావం మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే పూజ అనంతరం శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటింటా చల్లాలట. ఈ విధంగా ఇంట్లో శంఖాన్ని పూజించడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుందట. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోతాయని చెబుతున్నారు. అయితే ఎలాంటి కారణం లేకుండా శంఖాన్ని ఊదకూడదట. శంఖం ఊదడం ప్రాక్టీస్ చేయాలనుకున్నపుడు, పూజకు ముందు, తర్వాత మాత్రమే శంఖం ఊదడం ఆచరించాలి. పూజ లేకుండా శంఖాన్ని ఊదడం వల్ల లక్ష్మీదేవికి శాపానికి గురి కావాల్సి వస్తుందట.