Site icon HashtagU Telugu

Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

Amarnath

Amarnath

రెండేళ్ల తరువాత జరుగుతున్న అమరనాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి భద్రతాబలగాలు. గత రెండేళ్లుగా ఈ యాత్ర జరగలేదు. కరోనా వల్ల యాత్రను నిలిపివేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కేసులు తగ్గడంతో మళ్లీ యాత్రను ప్రారంభించింది. భద్రతను కట్టుదిట్టంగా చేయడంతో ఈ యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలో నలుమూలల నుంచి వచ్చి భక్తులు.. అమరనాథుడిని మనసారా దర్శించుకుంటున్నారు.

సోన్ మార్గ్ లోని బాల్టల్, పహల్గాంలోని మహాగుణాస్ మార్గాల మీదుగా భక్తులు అమరనాథ్ కు వెళ్తున్నారు. ఆ పరమేశ్వరుడిని భక్తిశ్రద్దలతో కొలుస్తున్నారు. ఈ యాత్ర మొత్తం 43 రోజుల పాటు కొనసాగుతుంది. వచ్చే నెల.. అంటే ఆగస్టు 11తో ముగుస్తుంది. కరోనా వల్ల రెండేళ్లపాటు గ్యాప్ రావడంతో.. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, యాత్ర సజావుగా సాగడానికి వీలుగా ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

అమరనాథ్ గుహలో ఉన్న ఆ పార్వతీ పతిని దర్శించుకోవడం తమ జన్మజన్మల భాగ్యమన్నారు భక్తులు. ఈ విషయంలో స్థానిక ప్రజలతోపాటు భద్రతా దళాలు అందించిన సహకారాన్ని ప్రశంసించారు. వారు కల్పించిన సౌకర్యాల వల్ల తమకేమీ ఇబ్బందులు కలగలేదని అన్నారు. అందుకే వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసారి యాత్రకోసం భద్రతాదళాలు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశాయి.

అమరనాథ్ యాత్ర సజావుగా సాగడానికి వీలుగా యాత్రా మార్గం పొడవునా అదనపు బంకర్లను ఏర్పాటు చేశాయి భద్రతాదళాలు. దీంతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పరికరాలను ఉపయోగిస్తూ.. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. టెర్రరిస్టుల నుంచి ఎలాంటి సమస్య రాకుండా ముందే గట్టి ఏర్పాట్లు చేశాయి.

24 గంటలపాటూ కాపలా కాసేలా.. సుమారు 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరాయంగా గస్తీ కాస్తాయి. ఇన్ని ఏర్పాట్ల వల్ల అమరనాథ్ యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది.