Paapmukti Certificate: రోజులు గడిచే కొద్దీ.. మనుషులు చేసే పాపాలు కొండల్లా పెరిగిపోతున్నాయి. తెలిసి చేసినా.. తెలియక చేసినా తాము చేసిన పాపాలను మన్నించాలంటూ అందరూ తమ ఇష్టదైవానికి మొక్కుతారు. క్షమించాలని వేడుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అందరి ప్రార్థన ఒక్కటే. నేను చేసిన పాపాలనుంచి విముక్తి చేసి.. తప్పులను క్షమించాలని. అయితే.. పాప ప్రక్షాళనకు కూడా ఒక ఆలయంలో సర్టిఫికేట్ ఇస్తారు. వింతగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఈ ఆలయంలో ఇది ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది.
రాజస్థాన్ లో ఉన్న ఒక దేవాలయంలో భక్తులకు పాపపు ధృవీకరణ పత్రాలను అందించడం ఆచారబద్ధంగా వస్తోంది. పాపాలను పోగొట్టుకునేందుకు భక్తులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం 12 రూపాయలు చెల్లిస్తే చాలు. కానీ.. ఏడాదికి కొన్ని సర్టిఫికేట్లను మాత్రమే అందజేస్తారు.
రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ లో ఉందీ ఆలయం. ఈ ఆలయాన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. శతాబ్దాలుగా తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఇందులోనే మందాకిని పాప్ మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. ఇక్కడ స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి.. పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 12 రూపాయలు చెల్లించి స్నానం చేస్తే పాపవిమోచన పత్రాన్ని ఇస్తారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఈ పద్ధతి కొనసాగుతోంది.
ఈ ఆలయం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులు, ప్రజలు వస్తుంటారని, స్నానాలు చేసి పాపవిమోచన ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటారని అర్చకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం గౌతమేశ్వరాలయం నుంచి 250 నుండి 300 పాపవిమోచన ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. కేవలం పాపవిముక్తి కోసమే కాదు.. పూజలు చేసేందుకు కూడా ఏటా వందలాది భక్తులు ఈ శివాలయానికి వస్తుంటారు.