పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ రోజున చేసే శివకేశవుల పూజకు, ఉపవాసానికి, దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం. ఈనేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది.. పూజా విధానం, విశిష్టత వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం..
శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. ఈ ఏడాది 2025 అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది. అక్టోబర్ 29 సాయంత్రం 05.29 గంటలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటలకు ముగుస్తుంది. (ఆయా ప్రాంతాలు, పద్ధతుల ప్రకారం సమయంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు). అక్టోబర్ 30వ తేదీనే కోటి సోమవారం ఆచరించనున్నారు.
వ్యాస మహర్షి రచించిన స్కందపురాణం ప్రకారం చూస్తే.. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శివ కేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతోంది. కోటి సోమవారం రోజు సూర్యోదయాంతోనే నిద్రలేచి నదీస్నానం ఆచరించడం అత్యుత్తమం. ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు నదులు, చెరువులు, కాలువల్లో నివసిస్తాడని అంటారు. అందుకే కార్తీక మాసంలో నది స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది.
కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటారు. అయితే.. కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహరం తీసుకోకుండా.. రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి.
కోటి సోమవారం రోజున శివాలయంకు వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో… పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే.. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం. అనంతరం బిల్వ పత్రాలతో, తుమ్మి పూలతో పరమశివుడిని అర్చించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు వంటివి సమర్పించాలి. సాయంకాలం పూట యధావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపారాధన చేసి, తులసీ మాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి.. భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతే కాకుండా సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధ పుష్ప అక్షతలతో పూజించి.. బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని.. వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం.
సాధారణంగా విశిష్టమైన కార్తీక మాసంలో వన భోజనాలు విశేషంగా చేస్తుంటారు. అయితే కార్తీక మాసంలో మామూలు రోజులు చేసే వన భోజనాల కన్నా కోటి సోమవారం రోజు చేసే వనభోజనానికి కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్లు ఉన్న ప్రాంతంలో.. ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, శ్రీమహావిష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి.. అనంతరం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం మంచిది.
మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండటం, పేదలకు, ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదం.

