Diwali 2023 : హిందువులు ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకునే ప్రధాన పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా.. చీకట్లను తొలగించి వెలుగును తెచ్చిపెట్టిన పండుగగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసుర వధ జరిగిన మరుసటి రోజున.. ఆ రాక్షసుడి పీడా వదిలిపోయిందన్న ఆనందంలో దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి. కుల, మత బేధాలు లేకుండా అందరూ తమకు తోచిన విధంగా దీపాలను వెలిగించి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం ఆశ్వీయుజ అమావాస్య తిథి రెండురోజులు రావడమే.
ఈ ఏడాది ఆశీయుజ అమావాస్య తిథి నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2.44 గంటలకు మొదలై.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2.56 గంటలకు పూర్తవుతుంది. దీపావళి అంటే చాలా వరకూ లక్ష్మీదేవి పూజ చేసి, దీపాలు వెలిగిస్తారు. అమావాస్య ఘడియలు 12వ తేదీ సాయంత్రానికి ఉన్నాయి కాబట్టి.. ఆరోజునే దీపావళి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు.
నవంబర్ 13 సోమవారం మధ్యాహ్నం వరకూ అమావాస్య ఉంటుంది కాబట్టి.. ఆ రోజున వైధిక క్రతువులు చేసుకోవాలని సూచించారు. దీపదానాలు, యమతర్పణాలు, ఇతరత్రా దానాలు చేసేందుకు సోమవారం వీలుంటుందని, ఆరోజున వైధిక దీపావళి జరుపుకోవచ్చని పేర్కొన్నారు.