TTD: ఏప్రిల్ 9న తిరుమలలో ఉగాది ఆస్థానం, పలు పూజ కార్యక్రమాలు రద్దు

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 12:15 PM IST

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు.

అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకుని ఏప్రిల్ 9వ‌ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టీటీడీ రద్దు చేసింది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాలకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. వేసవి దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు చేస్తున్నట్ల టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే సిఫార్సు లేఖ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎండలు తీవ్రత పెరుగుతుండడంతో భక్తులకు క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదం అందిస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. మాడవీధుల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించామన్నారు.