లడ్డూ తయారీలో (TIrumala Laddu) కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు దర్యాప్తు బృందంలో ఉన్నారు.
మూడు బృందాలుగా సిట్ అధికారులు విడిపోయి విచారణ మొదలుపెట్టారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. తిరుమలలో లడ్డూ తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ఓ బృందం పరిశీలిస్తోంది. మరో బృందం నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నెయ్యి సరఫరా, టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు అధికారుల నుంచి సిబ్బంది పాత్ర వరకు దర్యాప్తు చేస్తోంది సిట్. తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకోనుంది. శనివారం తిరుపతికి వచ్చిన సిట్ బృందం నెయ్యి కొనుగోలు టెండర్లు, సప్లైకి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. తిరుమలకు ఎప్పుడెప్పుడు ఎన్ని లారీల నెయ్యి వచ్చింది.. ఆ లారీల నంబర్లు తదితర వివరాలను పరిశీలిచింది. రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ఏ కంపెనీలు బిడ్ లు దాఖలు చేశాయి? అన్న వివరాలను సిట్ సేకరించింది. ఓ పక్క సిట్ తమ పని తాము చేసుకుంటూపోతుంటే వైసీపీ నేతలు మాత్రం సిట్ దర్యాప్తు ఫై నమ్మకం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ వ్యవహారంలో ఎవర్ని వదిలిపెట్టవద్దంటూ సిట్ అధికారులను కోరుతున్నారు.
తాజాగా సినీ నటుడు సుమన్ (Actor Suman) కల్తీనెయ్యి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేరం తీవ్రవాదం కంటే ఎక్కువని, ఇలాంటి పని చేసిన వారిని వదలొద్దన్నారు. ‘నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉంటే టీటీడీ బోర్డు ఏం చేసింది? ట్యాంకర్ నుంచి ఎలా తీశారు? దీన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు.
Read Also : Tehsildars : అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కానివ్వొద్దు : మంత్రి పొంగులేటి