మన జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే అనుకున్న పనులు సరిగా నెరవేరకపోవడం, ఎన్నో సమస్యలు చుట్టుముట్టడం, అనారోగ్య సమస్యలు వంటివి తలెత్తుతుంటాయి. అయితే ఇలా జాతకంలో గ్రహదోషాలు ఉన్న వారు వాటికి సరైన పరిహారాలు చేయటం వల్ల జాతక దోషాలు నుంచి విముక్తి పొందవచ్చు. అనేక సమస్యలకు ప్రధానకారణంగా మనకు జ్యోతిషులు చెప్పేది నవగ్రహదోషాలు. అయితే చాలామందికి ఖర్చుతో కూడుకున్న నవగ్రహ జపాలు, శాంతి, హోమాలు, దానాలు సాధ్యం కాదు. మరి ఎలా ఈ సమస్య పరిష్కారం అవుతుందనేది లక్షలాదిమంది భక్తుల అనుమానం. అయితే పలు పురాణాల్లో అనుభవజ్ఞుల జీవితంలో ఆచరించిన పలు చిన్నచిన్న క్రియలు నవగ్రహదోషాలను తొలగిస్తాయి. ఆ పరంపరలోనే భాగంగా..నవగ్రహ దోషం పోవాలంటే అత్యంత సులభమైన ఆచరణ ఏంటో మనం తెలుసుకుందాం..!
జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్నస్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్త్రాలలో చెప్పిన సులభ ఉపాయాన్ని తెలుసుకుందాం. గోవు (ఆవు) ద్వారా మన నవగ్రహ దోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు ఉంటారు. సప్తఋషులు గోవులో ఉంటారు. గోపాదల్లోనూ ధర్మార్థకామమోక్షములు ఉంటాయి.
ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే పాపాలు నశిస్తాయి. అయితే గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో, ఇష్టదేవతానామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పక నవగ్రహదోషాలు పోతాయని నమ్మకం. అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి ప్రధానం, మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ, గోదానం, గోసేవ చేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడండి. వీలైతే గోవులు నడిచిపోయిన వెంటనే ఆ మట్టిని కొంత సేకరించి మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన స్నానం చేసిన తర్వాత పొడి భస్మంగా కొంచెం పెట్టుకోండి. మీ నవగ్రహదోషాలు అన్ని పోతాయి.