TTD Decisions: బ్రహ్మోత్సవాల రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ముంగిట టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - July 29, 2022 / 12:35 PM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ముంగిట టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్యులకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా అన్ని రకాల వీఐపీ, ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు మాడ వీధుల్లో నిర్వహించ‌నుండ‌డంతో పెద్దసంఖ్యలో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు , టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్నమ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ ప‌ర‌మేశ్వర్‌ర్రెడ్డి, ఇత‌ర టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వహించారు.

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయ‌ని, ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణర‌థం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు సెప్టెంబర్ 27న సీఎం వైఎస్‌. జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వజారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్దశేష వాహ‌నసేవ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహిస్తామ‌న్నారు.

మూడో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో త‌మిళ‌నాడు భ‌క్తులు పెద్దసంఖ్యలో వ‌చ్చే అవ‌కాశ‌ముందని, ర‌ద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల‌నే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రుల‌కు ప్రత్యేక ద‌ర్శనం, త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామ‌న్నారు.

కేవలం స‌ర్వదర్శనం మాత్రమే ఉంటుందని, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్రస్టుల దాతలకు ద‌ర్శన‌ టికెట్లు రద్దు చేశామ‌ని, ఆర్జిత సేవలు కూడా రద్దు చేశామ‌ని వివ‌రించారు. స్వయంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్రమే బ్రేక్ ద‌ర్శనం ఉంటుంద‌న్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు
బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌న్నారు. భ‌ద్రత ప‌రంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల స‌మ‌న్వయంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని ఈవో వెల్లడించారు. అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, కార్లకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు.

భ‌క్తుల‌కు ర‌వాణాప‌రంగా ఇబ్బందులు లేకుండా ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ముఖ్యంగా గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు న‌డుపుతామ‌ని చెప్పారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జ‌రగ‌కుండా చూసేందుకు వీలుగా గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేధిస్తామ‌న్నారు.