Site icon HashtagU Telugu

Yaganti: ఆసక్తిని రేపుతున్న యాగంటి ఆలయ రహస్యాలు.. కాకులు ఉండవు.. పెరుగుతున్న బసవన్న!

Yaganti

Yaganti

ప్రముఖ శైవ క్షేత్రాలలో యాగంటి కూడా ఒకటి. ఈ యాగంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బనగానపల్లి అనే గ్రామానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ఎన్నో ఆసక్తికర అంశాలకు ఈ ఆలయం నిలయం అని చెప్పాలి. యాగంటిలో బసవేశ్వరుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాడు. ఒకప్పుడు చిన్నగా ఉన్న బసవేశ్వరుడు పెరిగి పెరిగి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాడు. అదే అక్కడ విశిష్టతగా చెప్పుకోవచ్చు. శివుడి విగ్రహ రూపంలో ఉన్న అరుదైన క్షేత్రం కూడా ఇదే అని చెప్పాలి. ఇక్కడ శివ పార్వతులు పూజలు అందుకుంటారు. ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.

ఉమా మహేశ్వరుల దర్శనమిచ్చే ఆలయం యాంగంటిలోనే ఉందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాగా ఉమా మహేశ్వరులు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. యాగంటి బసవయ్య ప్రతి 20 ఏళ్లకు ఒక అంగుళం పెరుగుతాడు. ఇది పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అంచనా వేశారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. అది ఏంటంటే.. మామూలుగా ఎక్కడ అయినా సరే ఆలయ ప్రాంగణం లోకి రకరకాల పక్షులు రావడం అన్నది సహజం. కానీ ఇక్కడ మాత్రం కాకులు కనిపించవు. దీని వెనుక పురాణగాధ కూడా ఉంది. ఇవి కనిపించకపోవడానికి కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇక్కడ కాకులు కనిపించకపోవడం వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. ఎర్రమలలోని మాడుకొండల మధ్య అగస్త్య మునీశ్వరుడు తపస్సు చేసేవాడు. ఈ ప్రాంతం దట్టమైన అడవి మధ్యలో ఉండేది. మునీశ్వరుడు తపస్సును భంగం చేసేందుకు కాకాసురుడు అనే రాక్షసుడు వేలాది కాకులను పంపించాడు. వాటి అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. తాను తపస్సును చెడగొట్టడానికి కాకాసురుడు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న మునేశ్వరుడు యాగంటి పరిసర ప్రాంతాల్లో కాకులు సంచరించకుండా శపించాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం పరిధిలో కాకులు కనిపించడం లేదని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే చుట్టుపక్కల ఎక్కడా కూడా కాకులు కనిపించకపోవడం అన్నది మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో రెండు కోనేరులు ఉంటాయి. అందులో ఒకటి భక్తులు స్నానం చేసే కోనేరు మరొకటి దేవుడికి సంబంధించిన కోనేరుగా బావిస్తారు.