దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నవరాత్రులలో నేడు మొదటి రోజు. ఇప్పటికే పెద్ద పెద్ద ఆలయాలు అందంగా ముస్తాబు అయ్యాయి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా శరన్నవరాత్రులు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్ 03వ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ముగియనున్నాయి. ఈ సారి వచ్చే శారదీయ నవరాత్రుల్లో శూల యోగం, ధ్రుతి యోగంతో పాటు అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు నవరాత్రుల్లో మొదటి రోజున శని దేవుడు శతభిషా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు.
పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. మరోవైపు నవమి తిథి నాడు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజే శ్రీరాముడు జన్మించాడని పండితులు చెబుతారు. ఈ సమయంలో ఉపవాసం ఉండే వారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. అలాగే ఈ నవరాత్రుల సమయంలో దుర్గమ్మ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నవరాత్రి సమయంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి. అలాగే దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగించాలి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో దర్శనం ఇచ్చే దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
నవరాత్రుల సమయంలో దశమి తిధి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒకవేళ అఖండ జ్యోతి వెలిగించకపోతే ఉదయం సాయంత్రం రెండు పూటలా పూజ చేయాలి. అఖండ జ్యోతిని వెలిగించిన వారు ఆ అఖండ జ్యోతి 9 రోజులపాటు ఆరిపోకుండా చూసుకోవాలి. ఇక ఈ నవరాత్రులలో తొలి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి. అలాగే దుర్గామాత ఫోటోనే లేదా విగ్రహాన్ని చెక్క పీటపై ప్రతిష్టించాలి. అమ్మవారి విగ్రహం ఎడమవైపున శ్రీ వినాయకుని విగ్రహాన్ని ఉంచాలి. ఇక అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పటించాలి. దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించడంతోపాటు ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. పైన చెప్పిన విషయాలు పాటిస్తే తప్పకుండా దుర్గమ్మ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.