Site icon HashtagU Telugu

Navaratri 2024: అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ రంగు బట్టలు ధరించాల్సిందే!

Navaratri 2024

Navaratri 2024

రేపటి నుంచి శరన్నవరాత్రులు మొదలు కానున్నాయి. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలను చాలా అందంగా అలంకరించారు. కాగా శరన్నవరాత్రులు దుర్గాదేవికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పాటు జరిగే ప్రసిద్ధ పండుగ అని చెప్పవచ్చు. ఈ నవరాత్రులలో చాలామంది అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులపాటు మాంసాహారాలు తినకుండా అమ్మవారికి పూజలు, ప్రార్థనలు ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారికి పూజ చేయడం మంచిదే కానీ పూజ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని రంగుల దుస్తులను ధరించాలని చెబుతున్నారు.

ఇంతకీ దేవి నవరాత్రి ఎప్పుడు అన్న విషయానికి వస్తే.. ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శరన్నవరాత్రులు బుధవారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. నవ రాత్రులు అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. ఇంతకీ ఏ రంగు దుస్తులను ధరించాలి అన్న విషయానికి వస్తే.. మొదటి రోజు నవరాత్రుల మొదటి రోజున ఘటస్థాపన చేస్తారు. ఈ రోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రికి ఇష్టమైన రంగు తెలుపు రంగు. అమ్మవారికి తెలుపు రంగు చాలా ఇష్టం. అలాగే నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిని తల్లిని పూజిస్తారు. ఈ అమ్మవారి కూడా తెలుపు రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం. కాబట్టి రెండవ రోజున కూడా తెల్లని రంగును పూజలో ధరించాలి.

మూడవ రోజు అమ్మవారు చంద్ర గంట తల్లి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున పూజ చేసే వారు ఎరుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారికి పూజ చేయడం మంచిది. నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండా దేవి అలంకారంలో మనకు దర్శనం ఇస్తారు. కాబట్టి ఈరోజున అమ్మవారికి పూజ చేసేవారు ముదురు నీలం లేదంటే ఉదా రంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిది. ఇక ఐదవ రోజు అమ్మవారు స్కందామాతగా దర్శనమిస్తారు. ఈరోజున అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు రంగు లేదంటే తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిది. ఇక ఆరవ రోజు అమ్మవారు కాత్యాయిని దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. ఇక ఈ అమ్మవారిని పూజించేటప్పుడు గులాబీ రంగు దుస్తులను ధరించడం మంచిది.

ఇక ఏడవ రోజు అమ్మవారు కాళీమాతగా దర్శనమిస్తారు. ఈరోజున అమ్మవారిని పూజించే వారు బూడిద రంగు లేదంటే గోధుమ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిది. ఇక ఎనిమిదవ రోజు మహా గౌరీ రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజున అమ్మవారు తెలుపు లేదంటే ఉదా రంగు దుస్తులను ధరించి పూజ చేయడం మంచిది. ఇక చివరిగా తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధి ధాత్రి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజున అమ్మవారిని పూజించేవారు పచ్చని వస్త్రాలు ధరించడం మంచిది.