Site icon HashtagU Telugu

Navaratri 2022: దసరా శరన్నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు!!

Goddesses Durga

Goddesses Durga

చెడు మీద మంచి సాధించిన విజయమే “దుర్గాష్టమి”. దీన్నే దసరా లేదా విజయ దశమి అని అంటారు. దసరాకు ముందు నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజిస్తారు. ఈ ఏడాది దసరా నవరాత్రులు దగ్గరపడ్డాయి. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబరు 26 తేదీన ప్రారంభమై.. అక్టోబర్ 5 విజయ దశమి రోజుతో ముగుస్తాయి. ఈ నవరాత్రులనే శరన్నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు.  ఈ పండుగను దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగలో శక్తికి చిహ్నమైన దుర్గాదేవిని పూజిస్తారు.

తొమ్మిది రాత్రులు..తొమ్మిది రూపాలు

నవరాత్రి అంటే ‘తొమ్మిది రాత్రులు’ అని అర్ధం.హిందూమతంలో నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంది. నవరాత్రులు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రథమ రోజున ప్రారంభమై…. నవమి రోజుతో ముగుస్తాయి.ఈ నవరాత్రి సమయంలో భక్తులు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంద మాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు.

ఒక్కో రోజు ఒక్కో రూపం..

26 సెప్టెంబర్ (1వ రోజు) – దేవీ శైలపుత్రి ఆరాధన
27 సెప్టెంబర్ (2వ రోజు) – మాత బ్రహ్మచారిణి ఆరాధన
28 సెప్టెంబర్ (3వ రోజు) – తల్లి చంద్రఘంట ఆరాధన
29 సెప్టెంబర్ (4వ రోజు) – మాత కూష్మాండ ఆరాధన
30 సెప్టెంబర్ (5వ రోజు) – తల్లి స్కందమాత ఆరాధన
అక్టోబర్ 1 (ఆరవ రోజు) – కాత్యాయని మాత ఆరాధన
అక్టోబర్ 2 (ఏడవ రోజు) – మాత కాళరాత్రి ఆరాధన
అక్టోబర్ 3 (ఎనిమిదవ రోజు) – తల్లి మహాగౌరి ఆరాధన
అక్టోబర్ 4 (తొమ్మిదవ రోజు) – మాత సిద్ధిదాత్రి ఆరాధన
అక్టోబర్ 5 (పదో రోజు) – విజయదశమి లేదా దసరా

నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటంటే..

శివుడు తన భార్య అయిన దుర్గాదేవికి.. ఆమె తల్లిని చూడడానికి కేవలం తొమ్మిది రోజులే అనుమతి ఇచ్చారని అవే ఈ నవరాత్రులని నమ్ముతారు. అదే సమయంలో, దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరిస్తుంది. అందుకే, దుర్గాదేవి శక్తికి ప్రతిరూపంగా, కాళీ మాతగా చెప్పబడుతుంది. దేవతలందరిలోనూ దుర్గాదేవి అత్యంత శక్తివంతురాలని, ఆమె శక్తి శాశ్వతమైనదని చెబుతారు.  ఈ శక్తిని మళ్లీ సృష్టించడం, నాశనం చేయడం లాంటివి చేయలేరని అంటారు.

ఉపవాసాలు, వేడుకలు..

నవరాత్రి ఈ తొమ్మిది రాత్రులు, ప్రజలు ఉపవాసాలు పాటిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రజలు రాముడి కథను వర్ణిస్తారు. ఎనిమిదవ రోజు, కన్యా పూజను జరుపుకుంటారు, దీనిలో బాలికలను పూజించి ప్రసాదం, ఆహారం, స్వీట్లు అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రజలు సామూహికంగా దాండియా, గర్బా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

మహాష్టమి వ్రతం అక్టోబర్ 3న..

నవరాత్రుల తొమ్మిది రోజులలో తేదీ ప్రకారం దుర్గాదేవిని పూజిస్తారు. ఈసారి మహాష్టమి వ్రతం అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. ఈ రోజున మహాగౌరిని పూజిస్తారు. అక్టోబర్ 4 న నవమి వస్తుంది. ఈ రోజున మాత సిద్ధిదాత్రిని పూజిస్తారు. అక్టోబర్ 5 అంటే పదో రోజున దుర్గాదేవి నిమజ్జనంతో నవరాత్రులు ముగుస్తాయి.
మహానవమి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, దుర్గాదేవి రాక్షస రాజు మహిషాసురుడితో 9 రోజులు పోరాడింది. అందుకే ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. నవరాత్రుల చివరి రోజున అంటే నవమి నాడు దుర్గాదేవి విజయం సాధించింది కాబట్టి దీనిని మహానవమి అని కూడా అంటారు.

ఈ పొరపాట్లు చేయొద్దు..

* కొన్ని పండుగల అప్పుడు చిన్నచిన్న పొరపాట్లు చేసేస్తుంటాము. ఎప్పుడు ఎలా చేసినా దసరా రోజున మాత్రం ఇలా చేయడకూడదంటున్నారు జ్యోతిష్యులు.
* దసరాకు పూజా, వ్రతం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో మనం తెలిసో.. తెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే ఆ పర్యావసానాలు కూడా పొందాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
* నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు తొమ్మిదిరోజులు మాంసాహారం తినకూడదని చెబుతుంటారు.
* మరొ పాయింట్ కూడా ఉంది.. అదే నిమ్మకాయ.. నిద్ర.. దసరా రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని అస్సలు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి.
* నవరాత్రుల్లో వెల్లుల్లి, నాన్‌వెజ్, ఉల్లి తీసుకోకూడదన్న విషయం తెలిసిందే.
* నిమ్మకాయను కూడా కోయరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

 

Exit mobile version