Narasimha Jayanti: మే 14న నరసింహ జయంతి, ఆ రోజు చేయాల్సిన వ్రతం ఇదే..సకల కష్టాలు తొలగే అద్భుతమైన వ్రతం!!

హిందూ గ్రంధాల ప్రకారం, నరసింహ జయంతి లేదా నరసింహ చతుర్దశిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల చతుర్దశి రోజున జరుపుకుంటారు.

  • Written By:
  • Updated On - May 10, 2022 / 05:14 PM IST

హిందూ గ్రంధాల ప్రకారం, నరసింహ జయంతి లేదా నరసింహ చతుర్దశిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ తేదీ మే 14న వస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఈ తేదీన విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడని నమ్ముతారు. విష్ణువు నరసింహ అవతారంలో సగం సింహం, సగం మానవ రూపాన్ని ధరించాడు. అందుకే ఈ భగవంతుని రూపాన్ని నృసింహ స్వరూపంగా పిలుస్తారు.

వైశాఖ మాసం చతుర్దశి రోజున శ్రీ హరివిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించి తన ప్రత్యేక భక్తుడైన ప్రహ్లాదుని భయం నుండి రక్షించాడని చెబుతారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి నయం కాని రోగాల నుండి విముక్తి లభిస్తుందని నరసింహ భగవానుడు భక్తుడైన ప్రహ్లాదునికి వరం ఇచ్చాడు. సకల భోగములను అనుభవిస్తూ సర్వవిధ పాపములనుండి విముక్తుడై సర్వోన్నత స్థానమును పొందుతారని వరమిస్తూ తెలిపాడు.

నరసింహ జయంతి రోజు ఏం చేయాలి…
ఈ పవిత్రమైన దినాన భక్తులు ఉపవాసం ఉండాలి. నరసింహ స్వామి జయంతి రోజు ముఖ్యంగా స్వామి ఉద్భవించిన సమయం అంటే సూర్యాస్తమయ సమయంలో పూజలు చేయాలి.సూర్యాస్తమయం అయ్యేటప్పుడు హిరణ్యకశిపుడుని సంహరించేందుకు నరసింహావతారంలో శ్రీహారి ఉద్భవించాడు. అందుకే సూర్యాస్తమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి నైవేద్యంగా పానకం సమర్పించాలి.

పూజానంతరం ఓం నమో నారసింహాయ‘ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుంది.దీంతో సమస్త అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోవడంతో పాటు భూత ప్రేత పిశాచాల నీడ పడకుండా స్వామి ఆశిర్వాదం బలంగా మీ పై ఉంటుందని, ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. నరసింహ జయంతి ఉత్సవాలను దేశంలోని అన్ని నరసింహ ఆలయాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

నరసింహ చతుర్దశి 2022 లేదా నరసింహ జయంతి ఎప్పుడు?
వైశాఖ శుక్ల చతుర్దశి తేదీ ప్రారంభం: 14 మే 2022, శనివారం మధ్యాహ్నం 03:23 గంటలకు
వైశాఖ శుక్ల చతుర్దశి తేదీ ముగుస్తుంది: 15 మే 2022, ఆదివారం మధ్యాహ్నం 12:46 గంటలకు

నరసింహ జయంతి పూజ ముహూర్తం
నరసింహ జయంతి వ్రత పూజ సంకల్పానికి అనుకూల సమయం: ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 01:40 వరకు
నరసింహ జయంతి సాయంత్రం పూజ సమయాలు: సాయంత్రం 04:22 నుండి 07:05 వరకు

హిందూ గ్రంధాల ప్రకారం, పై శుభ సమయంలో నరసింహ చతుర్దశి వ్రతాన్ని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.