Site icon HashtagU Telugu

Nagula Chavithi Special: నాగుల చవితి రోజు ఇలా చేస్తే చాలు.. సర్వరోగాలు మటుమాయం?

Nagula Chavithi Special

Nagula Chavithi Special

తెలుగు రాష్ట్రాలలో హిందువులు జరుపుకునే పండుగలలో నాగుల చవితి కూడా ఒకటి. కొందరు రెండు రోజులు జరుపుకుంటే మరికొందరు ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటూ ఉంటారు. నాగుల చవితి రోజున పుట్టకు లేదా నాగుల కట్టను సందర్శించి పాలు పోసి నాగదేవతను ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధించి , తాము, తమ కుటుంబసభ్యులు సుఖ,సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లు ఫలాలు , నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు.
నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.

నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి , నీళ్ళు జల్లి , ముగ్గులు వేసి , పసుపు కుంకుమలు జల్లి , పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి , నాగదేవతకు నమస్కరించుకుంటారు. ఇతరుల సంగతి అలా ఉంచితే నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు. నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి , సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీలు కూడా నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.

నాగులు చవితి రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, వడపప్పు నైవేద్యంగా నేవేదించాలి. కాగా నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళ్లు ఉపవాసం వుంటారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతు కు పంటనష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.