హిందువులు జరుపుకునే పండుగలలో నాగుల చవితి పండుగ కూడా ఒకటి. ఈ నాగుల చవితి పండుగను శ్రావణ మాసంలో జరుపుకుంటారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రోజున పుట్టకు పాలు పోసి ఈ నాగదేవతలను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే నాగుల చవితి రోజు చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల పొరపాటు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు. మరి నాగుల చవితి ఎలాంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నాగుల చవితి రోజు భూమిని దున్నడం మట్టిని తవ్వడం, పుట్టలను కొట్టడం, చెట్టు నరికి వేయడం కూరగాయలు కోయడం లాంటి పనులు అస్సలు చేయకూడదట. అయితే వీటన్నింటినీ పూర్వకాలంలో మన పెద్దలు పాటించేవారు. ప్రస్తుత రోజుల్లో ఎవరు వీటిని పాటించడం లేదు. ఇప్పట్లో కూరగాయలు కట్ చేయకుండా వంటలు చేయడం అన్నది అసాధ్యం అని చెప్పాలి. అయితే ఈ విషయంలో వెసులుబాటు ఉందనే చెబుతున్నారు పండితులు. నాగుల చవితి పూజ ఎలా చేయాలి అన్న విషయాన్ని వస్తే.. ఈరోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తర్వాత గడపకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా వేయాలి. పూజకు ఎర్ర రంగు పువ్వులను వాడడం మంచిదని చెబుతున్నారు.
ఇక ఆ తర్వాత ఇంట్లో దేవుడి వద్ద దీపాన్ని వెలిగించాలి. ఇక మీరు నైవేద్యంగా చేసిన నువ్వుల చలివిడిని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. అలాగే అరటి పండ్లు వడపప్పు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఇంటి నుంచి పుట్ట దగ్గరకు వెళ్లే పుట్టను పసుపు కుంకుమతో పూజించి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత నైవేద్యాలను సమర్పించి పుట్టలో ఆవు పాలను పోయాలి. చేతిలో అక్షింతలు పట్టుకొని పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ సమయంలో మనసులు సంకల్పాన్ని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న ఆ కోరికలను నాగదేవతలు నెరవేరుస్తారని నమ్మకం. మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ అక్షింతలను పుట్టపై చల్లాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. ఆపై పుట్ట మన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయి. ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయాలి. ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు నాగేంద్ర అష్ణోత్తరం, నాగేంద్ర స్తోత్రము, నాగేంద్ర సహస్ర నామములు వంటివి చదివితే ఎంతో మంచిది. నాగుల చవితి నాడు ఓం నాగేంద్రస్వామినే నమః అని 108 సార్లు జపించాలి.