Venkateswara Swamy Temple: సైంటిస్టులకు కూడా అంతు చిక్కని రహస్యం.. అభిషేకం ఒక వింత.. ఎక్కడో తెలుసా?

ఇప్పుడు మనం తెలుసుకోబోయే వెంకటేశ్వర స్వామి విగ్రహం సైంటిస్టులకు సైతం అంత చిక్కడం లేదు. ముఖ్యంగా ఈ విగ్రహం అభిషేకం ఒక వింత అని చెబుతున్నారు. ఇంతకీ అ రహస్యాలు ఏంటో వింతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Venkateswara Swamy Temple

Venkateswara Swamy Temple

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో వెంకటేశ్వర స్వామి కూడా ఒకరు. వెంకటేశ్వర ఆలయాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టత ప్రత్యేకతను కలిగి ఉంది. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వెంకటేశ్వర ఆలయం కూడా ఒకటి. గబ్బూరులో కొలువైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి విగ్రహానికి సెగలు కక్కే నీటితో అభిషేకం చేస్తారట. ఆ నీరు తలనుంచి పాదాల దగ్గరకు వచ్చేసరికి చల్లగా మారిపోతాయట. సెగలు కక్కే నీరు సైతం పాదాల వద్దకు వచ్చేసరికి చల్లగా మారే అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తరించడం కోసం ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారట.

హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. మాములుగా పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగా, శ్రీ వేంకటేశ్వరుడిని అలంకార ప్రియుడిగా పిలుస్తారు. ఆ హరిహరులిద్దరూ కొలువుతీరిన క్షేత్రమే కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గబ్బూరులో ఉన్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ శివయ్య వెంకన్న కొలువు తీరడం వెనుక ఆసక్తికర కథనం కూడా ప్రచారంలో ఉంది. పన్నెండో శతాబ్దానికి చెందిన సేవన వంశ రాజు సింహనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారు. లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారట. కానీ తనకూ ఈ ఆలయంలో చోటుకావాలి అన్నాడట శ్రీహరి.

విష్ణువు మాట మేరకు శివుడు తనకోసం ఏర్పాటు చేసిన పీఠంపై వేంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించేలా చేశాడట. ఆ తర్వాత కాలంలో అగస్త్యముని శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. శివకేశవులు కొలువుతీరిన అరుదైన ఆలయాల్లో ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఒకటి. ప్రసన్న వేంకటరమణ, ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు హరిహరులు. ఇక్కడ స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో శివలింగంపై ప్రత్యేక గీతలు కనిపిస్తాయట. అందుకే దీనిని అరుదైన శివలింగంగా భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివార్లకు నిత్యం చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఆదివారం రోజు వెంకటేశ్వర స్వామికి జరిగే అభిషేకం మరొక ఎత్తు అని చెబుతున్నారు.

ఎందుకంటే ఆ రోజు కలియుగ దైవానికి వేడి వేడి నీటితో అభిషేకం నిర్వహిస్తారట. కానీ ఆ నీరు రెప్పపాటు కాలంలో చల్లగా మారిపోతుందట. కేవలం తలపై పోసిన నీరు చల్లగా మారిపోవడమే కాదు. మరో వింత కూడా ఉందట. చల్లటి నీటిని స్వామివారి నాభిస్థానంలో పోస్తే వేడిగా మారిపోతుందట. స్వామివారికి వేడినీటి అభిషేకం కేవలం ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు. ఈ వింతను చూసేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి మాత్రమే కాదు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివెళతారట. ఈ ఆలయంలో శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనమి ఇలా ప్రతి పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

  Last Updated: 24 May 2025, 10:52 AM IST