హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు మామూలుగా దీపారాధన నూనెతో దీపాలని వెలిగిస్తే మరికొందరు ఆవు నెయ్యి, ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటి రకరకాల నూనెలతో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందులో ఆవనూనెతో పెట్టే దీపం గురించి చాలామందికి తెలియదు. ఈ ఆవ నూనెను పూర్వం పెద్దల కాలం నుంచే వెలిగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ రోజు ఆవనూనె వెలిగించడం అన్నది చాలా ప్రదేశాలలో సాంప్రదాయం కూడా ఉంది. ఆవాలనూనెతో దీపాలు వెలిగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు ఏంటి? ఆవ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతిరోజూ ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగుతాయట. అంతేకాదు ప్రవహించే నీటిలో ఆవనూనె దీపం వెలిగిస్తే ఐశ్వర్యం చేకూరుతుందట. అలాగే ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుందని చెబుతున్నారు. వ్యాపారం, ఉద్యోగాలో పురోగతి లేదు అనుకున్న వారు ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుందట. ఆవాల నూనెను ఒక గాజు సీసాలో వేసి ప్రవహిస్తున్న నదిలో వదలాలట. ఇలా చేస్తే జీవితంలో ఉన్నతి ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఆవాల నూనె దీపాన్ని వెలిగించి అందులో రెండు రూపాయల నాణెం వేయాలట. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి ప్రసన్నురాలు అవుతుందట. ఇంట్లో ధనానికి లోటు లేకుండా కూడా ఉంటుందని చెబుతున్నారు. శని దేవునికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు శని దేవుడికి నువ్వుల నూనె ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు.
కానీ శని దేవుడికి ఆవనూనెను సమర్పించినా కూడా సంతోషిస్తాడట. ఇలా ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే తన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శని దేవుడు చూసుకుంటాడట. అలాగే ప్రతిరోజూ సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయట. కుటుంబంలో ఇబ్బందులు, పిల్లల జీవితాలలో ఎదుగుదల లేకపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఏ పనులు తలపెట్టినా ఆటంకాలు ఎదురు కావడం మొదలైనవి మరణించిన పెద్దలు కోపించడం వల్ల జరుగుతాయట. అందుకే రావి చెట్టు దగ్గర దీపం పెడితే మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులకు కూడా ఆవాల నూనె దీపం చక్కని ఉపశమనాన్ని ఇస్తుందట. తలనొప్పి లేదా గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో ఆవాల నూనె దీపం వెలిగించాలట. ఈ దీపం నుండి వెలువడే వాసన, దీపపు పొగ తలనొప్పి, గొంతునొప్పిని తగ్గిస్తాయని చెబుతున్నారు.